` 74 శాతం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
` దీర్ఘకాలం నిలబడేలా ఆర్థిక సమతుల్యతతో పథకం అమలు
` మహిళల భద్రతకు బస్సుల్లో సీసీ కెమెరాలు, సిబ్బంది పెంపు
అమరావతి (చైతన్యరథం): మహిళలకు కూటమి ప్రభుత్వం మేలు చేస్తుంటే ఓర్వలేని జగన్ రెడ్డి సొంత మీడియా సాక్షి ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలుకు సంబంధించి విధివిధానాలు విడుదలైన సందర్భంగా మంత్రి మండిపల్లి సోమవారం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఆర్టీసీని విచ్ఛిన్నం చేసిందని, అన్ని ఒడిదొడుకులను ఓర్చుకొని కూటమి ప్రభుత్వం మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తుంటే వైసీపీ ఓర్చుకోలేకపోతోందన్నారు. మహిళలకు మేలు చేస్తుంటే జగన్ సొంత మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి తల్లికి, చెల్లికి లబ్ధి చేకూరుస్తామన్నారు.
బస్సుల్లో సీసీ కెమెరాలు
ఆర్టీసీ బస్సుల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రయాణికుల సౌకర్యవంతమైన ప్రయాణం కోసం సిబ్బందిని పెంచుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఈ పథకం పూర్తిస్థాయిలో అమలులో ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో, సిటీ ఆర్డినరీ. ఎక్స్రెప్రెస్ బస్సులే 74 శాతం నడుస్తున్నాయి. వాటిలోనే ఎక్కువమంది మహిళలు ప్రయాణిస్తున్నారు. అందుకే ఆ బస్సుల్లోనే ఉచిత ప్రయాణాన్ని అమలు చేసి ఎక్కువ మందికి లబ్ధి చేకూరుస్తున్నాం. నాన్‌స్టాప్, సూపర్ లగ్జరీ, ఏసీ తరహా బస్సులు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. ఆర్టీసీ స్థితిని దృష్టిలో ఉంచుకొని, పథకం దీర్ఘకాలం నిలబడేలా ఆర్థిక సమతుల్యతతో పథకం అమలు చేస్తున్నాం. అన్ని రకాల బస్సుల్లో ఒకేసారి అమలు చేస్తే ఆర్టీసీపై భారీ భారం పడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతుంది. కొద్దిపాటి లగ్జరీ కేటగిరీ సర్వీసులను మినహాయించడం వల్ల పథకాన్ని ‘మోసం’ అని పేర్కొంటూ సాక్షి మీడియా విష ప్రచారం చేస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతిరోజూ లక్షలాది మహిళలు ఉద్యోగాలు, విద్య, వైద్య సేవల కోసం ఉచితంగా ప్రయాణించే అవకాశం పొందనున్నారని మంత్రి మండిపల్లి తెలిపారు.
మార్గదర్శకాలు విడుదల
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ‘స్త్రీ శక్తి’ పేరిట ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 5 కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని అందించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడిరచింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ర్‌ప్రెస్, ఎక్స్ర్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయొచ్చు.
తిరుమల-తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు పథకం వర్తించదు. బస్సుల్లో రద్దీ పెరగనున్న దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీని ఆదేశిస్తూ.. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు..