సంబేపల్లి (చైతన్యరథం): పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం, నాగిరెడ్డిగారిపల్లెలో 27.60 లక్షలతో నిర్మించిన మినీ గోకులాలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్త్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్తంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాడి రైతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతి గ్రామానికి మినీ గోకులాలు మంజూరు చేసిందన్నారు. సంబేపల్లి మండలంలోని నాగిరెడ్డిగారిపల్లెకు 12 మినీ గోకులాలు మంజూరు చేసి పూర్తి చేశామన్నారు. ఒక్కొక్క మినీ గోకులాన్ని రూ.2.30 లక్షల వ్యయంతో నిర్మించామన్నారు. పాడి రైతుల పశువులు ఎండ, వాన బారిన పడకుండా మినీ గోకులాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పాడి రైతులందరూ ప్రభుత్వం అందించే సబ్సిడీలను సద్వినియోగం చేసుకొని మరింత అభివృద్ధి చెందాలన్నారు. అనంతరం నారాయణరెడ్డి గారిపల్లెలో నిర్మించిన సిమెంట్ రోడ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రిని నారాయణరెడ్డిగారిపల్లె గ్రామ ప్రజలు గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.