- విద్యార్థులను నూతన ఆవిష్కరణలవైపు ప్రోత్సహించేలా చర్యలు
- కుప్పంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌తో కలిసి సామర్థ్యాల పెంపునకు కృషి
- రీజనల్ సైన్స్ సెంటర్ల అభివృద్ధికి కార్యాచరణ
అమరావతి (చైతన్యరథం): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్స్‌ను తగ్గించడంతో పాటు రాష్ట్రాన్ని నాలెడ్జ్, ఇన్నోవేటివ్ హబ్‌గా రూపొందించేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రాజెక్టు ఆధారిత, పీర్ టూ పీర్ లెర్నింగ్ విధానాలను దేశమంతటా నెలకొల్పుతున్న అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌తో కలిసి రాష్ట్ర విద్యార్థులను నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు సంకల్పించారు. ఇప్పటికే విజనరీ లీడర్ చంద్రబాబునాయుడు నేతృత్వంలో 1998లో కుప్పంలో 172 ఎకరాల విస్తీర్ణంలో అగస్త్య క్యాంపస్ క్రియేటివిటీ ల్యాబ్‌ను అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఆ స్ఫూర్తితో రాష్ట్రంలోని రీజనల్ సైన్స్ సెంటర్స్‌ను అభివృద్ధి దిశగా తీసుకెళ్లనున్నారు. ఈ మేరకు ఉండవల్లిలోని నివాసంలో అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతినిధులు మంగళవారం మంత్రి నారా లోకేష్‌తో సమావేశమయ్యారు. దేశంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల్లో ఆసక్తి, సృజనాత్మకత, విశ్వాసాన్ని పెంపొందించేందుకు తాము చేపడుతున్న కార్యక్రమాలను ఫౌండేషన్ ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు జీవితంలో ఉన్నతంగా రాణించేలా, వారిలో వివిధ రకాల సామర్థ్యాల పెంపునకు అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తో కలిసి స్టెమ్ ల్యాబ్స్, మొబైల్ స్టెమ్ ల్యాబ్స్, మోటార్ బైక్స్ ల్యాబ్, యంగ్ ఇన్‌స్ట్రక్టర్ లీడర్స్, ఉపాధ్యాయులే స్కూల్ వారీగా తక్కువ ఖర్చుతో ఏర్పాటుచేసుకోగలిగే సైన్స్ ల్యాబ్‌ల గురించి మంత్రి నారా లోకేష్ చర్చించారు.
రాష్ట్రంలోని విద్యార్థులకు క్రియేటివ్ లెర్నింగ్, సృజనాత్మకత పెంపునకు తాము అనుసరించబోయే విధానాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. విద్యార్థుల్లో సైన్స్ నాలెడ్జ్, నాయకత్వ పటిమ, సమస్యలను పరిష్కరించుకునే నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, ఆసక్తి, అవగాహన పెంపొందించడమే తమ సంస్థ లక్ష్యమన్నారు.
ఈ సమావేశంలో అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఛైర్మన్ రామ్ జీ రాఘవన్, సభ్యులు ఏ.ఆంజనేయులు, ముకుంద్ జగన్నాథ్, సీఎస్ సురేష్‌తో పాటు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంఛార్జ్ ఛైర్మన్ సీఏ పుష్ప, తదితరులు పాల్గొన్నారు.