పలాస (చైతన్యరథం): కాశీబుగ్గలో తొక్కిసలాట విషయం తెలిసిన వెంటనే మంత్రి లోకేష్ హుటాహుటిన సంఘటనా స్థలానికి బయలుదేరారు. హైదరాబాద్ నుండి విశాఖకు విమానంలో వెళ్లి అక్కడి నుండి రోడ్డు మార్గంలో కాశీబుగ్గ చేరుకున్నారు. పలాస కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆత్మీయంగా పరామర్శించారు. ఆసుపత్రి వార్డుల్లో ప్రతి పడక దగ్గరకు వెళ్లి బాధితులందరినీ పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి అందుతున్న వైద్యం నాణ్యత గురించి కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. ఈ బాధలో మేము మీకు అండగా ఉంటాం. మీ చికిత్సకయ్యే ఖర్చు, ఇతర సహాయం… ప్రతీ విషయం ప్రభుత్వం చూసుకుంటుంది. ధైర్యం కోల్పోవద్దు. మేము అన్ని విధాలా మీకు అండగా నిలబడతామంటూ బాధితులకు మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. ఆయన వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.














