- కువైట్‌లో చిక్కుకున్న తిరుపతి జిల్లా వాసి
- యజమాని చేతుల్లో చిత్రహింసలు
- ఆదుకోవాలని ఎక్స్‌లో వేడుకోలు
- స్పందించి స్వస్థలానికి చేర్చిన మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి.. అక్కడ ఎదురైన విపత్కర పరిస్థితులు తట్టుకోలేక సాయం కోరిన వారికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అండగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు వివిధ దేశాల్లో చిక్కుకున్న సుమారు 25 మందిని రక్షించి స్వస్థలాలకు చేర్చారు. తాజాగా ఏజెంట్ల చేతిలో మోసపోయి కువైట్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న యల్లంపల్లి లక్ష్మిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకువచ్చి కుటుంబసభ్యుల వద్దకు చేర్చారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్‌కు చెందిన లక్ష్మి..బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లారు. అక్కడ యజమాని నిత్యం వేధింపులకు పాల్పడటంతో పాటు గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తుండటంతో రక్షించాలని ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్‌ను అభ్యర్థించారు. దీంతో మంత్రి లోకేష్.. తన టీం ద్వారా లక్ష్మిని కాపాడి స్వస్థలానికి చేర్చారు. సాయం కోరిన వెంటనే స్పందించి ఆదుకున్న మంత్రి నారా లోకేష్‌కు లక్ష్మి, ఆమె కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.