- దేవస్థానం పున:ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి
- ఘనస్వాగతం పలికిన ఆలయ అధికారులు, స్థానిక నాయకులు
- ఆలయంలో మంత్రి లోకేష్ ప్రత్యేక పూజలు
- ప్రత్యేక ఆశీర్వచనాలు అందించిన అర్చకులు
దుగ్గిరాల (చైతన్యరథం): మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం కంఠంరాజ కొండూరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీమహంకాళీ అమ్మవారి దేవస్థానం పున:ప్రతిష్ట మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు అధికారులు, స్థానిక నాయకులు మంగళవాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ పున:ప్రతిష్టను పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక సారె, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ రాకను పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. జ్ఞాపికను బహూకరించారు. అనంతరం ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి లోకేష్ రావటంతో స్థానిక ప్రజానీకం పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షురాలు కేసమనేని అనిత, తదితరులు పాల్గొన్నారు.
బకింగ్‌హాం కాలువ పరిశీలన
శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానం పున:ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని ముగించుకుని మంగళగిరికి పయనమైన మంత్రి లోకేష్ మార్గమధ్యలో కాజ-చినవడ్లపూడి మధ్యలో గల బకింగ్‌హాం కాలువను పరిశీలించారు. కాలువలో పెద్దఎత్తున గుర్రపు డెక్క పూడుకుపోవడాన్ని గమనించారు. వర్షాకాలంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా గుర్రపు డెక్కను తొలగించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.