- స్వామివారి కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పణ
- మంత్రి లోకేష్‌కు ఘనస్వాగతం పలికిన ఆలయ అధికారులు
కదిరి (చైతన్యరథం): శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో సోమవారం రాత్రి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఇలపై వెలసిన మహా విష్ణువు ప్రతిరూపం కదిరి శ్రీమాత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీన అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. 15 రోజులపాటు వైభవంగా సాగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం జరిగిన స్వామివారి కల్యాణమహోత్సవంలో మంత్రి పాల్గొని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వసంత వల్లభుడికి మంత్రి నారా లోకేష్‌తో వేదపండితులు సంకల్పం చేయించారు. ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. అంతకుముందు శ్రీఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. మంత్రి నారా లోకేష్ రాకను పురస్కరించుకుని పార్టీశ్రేణులు పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో పాటు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, హిందూపూర్ ఎంపీ బీకే పార్థసారథి, టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథరెడ్డి, ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.