- పోలింగ్ సరళిపై సమీక్ష
- ఎప్పటికప్పుడు నేతలకు దిశానిర్దేశం
అమరావతి (చైతన్యరథం): ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తీరును రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షించారు. రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా ఉన్న మంత్రి లోకేష్ ఉండవల్లిలో ఓటు వేసిన అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని పోలింగ్ సరళిపై అందుబాటులోని పార్టీ నేతలతో వార్ రూమ్‌లో సమావేశమయ్యారు. పోలింగ్ తీరుతెన్నులను పరిశీలిస్తూ, తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలకు మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. పోలింగ్ శాతం తక్కువగా నమోదైన నియోజకవర్గాలపై దృష్టి పెట్టి స్వయంగా ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులను ఆదేశించారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులకు మార్గ నిర్దేశం చేశారు. పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నేతలకు తగిన సూచనలు చేశారు.