- నేడు విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకి హాజరు కానున్న మంత్రి
- సాక్షిలో అసత్య కథనంపై లోకేష్ న్యాయపోరాటం
అమరావతి (చైతన్యరథం): సాక్షి పత్రికపై వేసిన పరువునష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో 3వసారి జరగనున్న క్రాస్ ఎగ్జామినేషన్కి మంత్రి నారా లోకేష్ ఈనెల 27న (సోమవారం) హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే రెండు క్రాస్ ఎగ్జామినేషన్స్ పూర్తికాగా, 3వ సారి లోకేష్ హాజరవుతున్నారు. సాక్షి తరపున మొత్తం 5గురు లాయర్లు వాదిస్తుండగా, మొదటి న్యాయవాది ప్రస్తుతం క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు.
చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి` శీర్షికతో 2019, అక్టోబర్ 22న సాక్షి పత్రికలో అసత్యాలు, కల్పితాలతో ఓ కథనం ప్రచురించారు. అవాస్తవాలతో, ఉద్దేశపూర్వకంగా తన పరువుకు నష్టం కలిగించే విధంగా ఈ కథనం ప్రచురించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన న్యాయవాదుల ద్వారా సాక్షి పత్రికకి రిజిస్టర్ నోటీసు పంపించారు. అయినప్పటికీ సాక్షి ఎటువంటి వివరణ వేయకపోవడం, నోటీసులకు స్పందించకపోవడంతో నారా లోకేష్ పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం ప్రచురించారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. తాను విశాఖలో ఉన్నానని ప్రచురించిన తేదీల్లో అసలు విశాఖలోనే లేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆహ్వానం మీద వచ్చే అతిథులకు చేసిన అతిథి మర్యాదల కోసం చేసిన ఖర్చుని తనకు అంటగడుతూ తన ప్రతిష్టని మంటగలిపేందుకు ప్రయత్నించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో మంత్రిగా తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్ పోర్ట్లో ఎటువంటి ప్రొటోకాల్ సౌకర్యాలు స్వీకరించలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో మంత్రి లోకేష్ తరపున గుంటూరుకు చెందిన సీనియర్ న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు హాజరవుతున్నారు.