- కేజీ టూ పీజీ పాఠ్య పుస్తకాల్లో మార్పులు
- పాఠశాలల్లో వార్షికోత్సవాల నిర్వహణ
- కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): ఈనెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడిరచారు. ఉండవల్లి నివాసంలో సోమవారం కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో.. సంస్కరణల అమలుకు సంబంధించి పాఠశాల విద్యలో తేనున్న మార్పులపై మంత్రి లోకేష్ వివరించారు. ఈ ఏడాది క్లస్టర్ రీ మ్యాపింగ్, జీఓ 117 రద్దు, టీచర్స్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్, ఉపాధ్యాయుల పదోన్నతుల, మౌలిక సదుపాయాల ఏర్పాటుపై రూట్ మ్యాప్ ఇచ్చారు. సంస్కరణలు పకడ్బందీగా అమలు చేయగలగితే వచ్చే ఏడాది నుంచే ఫలితాలు ప్రారంభమవుతాయని చెప్పారు. సంస్కరణలను లాజికల్‌గా ముందుకు తీసుకెళ్లాల్సి ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని ముందుకు తీసుకెళుతున్నామని, ఇందులో భాగంగా యూనిఫామ్స్, బుక్స్, అకడమిక్ కేలండర్‌పై ఎక్కడా పార్టీ ఫ్లేవర్ లేకుండా చేశామని చెప్పారు. శాసనసభ్యుల విజ్ఞప్తిపై పాఠశాలల్లో వార్షికోత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు.
ఎమ్మెల్యేల చొరవ కూడా అవసరం
జీఓ 117 రద్దు నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సంబంధించి శాసనసభ్యులు చొరవచూపాల్సి ఉందని మాజీమంత్రి కొణతల రామకృష్ణ సూచించారు. పాఠశాలల్లో కనీస సంఖ్యలో విద్యార్థులు ఉండేలా వారు చొరవచూపితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ విధానం అమలవుతుందని తెలిపారు. మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ…శివారు గ్రామాలు ఎక్కువగా ఉన్నచోట్ల ట్రాన్స్‌పోర్టేషన్‌కు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. జనసేన శాసనసభ్యురాలు లోకం మాధవి మాట్లాడుతూ…మోడల్ ప్రైమరీ స్కూలుకు కనీస విద్యార్థుల సంఖ్య 45గా నిర్ణయించాలని కోరారు. కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… గురుకుల పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నందున వాటిని పెంచే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ… ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలల విద్యార్థులకు ఎంసెట్, ఐఐటి వంటి కోచింగ్ నిర్వహించాలని విజ్ఞప్తిచేశారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ ఇప్పటికే ఇంటర్ విద్యార్థులకు ఇన్‌పుట్ మెటీరియల్స్ అందజేస్తున్నామని, కోచింగ్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడతూ… జీఓ 117పై కలెక్టర్లు, సబ్ కలెక్టర్లతో సమావేశం ఏర్పాటుచేసి, సమన్వయం చేసే బాధ్యత అప్పగించాలన్నారు.
గిరిజన ప్రాంతాల స్కూళ్లపై శ్రద్ధవహించండి
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వస్కూళ్లలో సౌకర్యాలపై బ్రాండిరగ్ చేయాలని అన్నారు. విశాఖ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ… కార్పొరేషన్ పరిధిలోని పెద్ద హైస్కూళ్లలో ఇండోర్ స్టేడియాలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ స్కూళ్లలో సీట్లు కావాలని మా వద్దకు రికమండేషన్ లెటర్ల కోసం తల్లిదండ్రులు వచ్చే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ… డీసీసీబీల్లో ఉన్న సీజీఎఫ్ నిధులను సర్కారీ స్కూళ్లలో మౌలిక సదుపాయాలకోసం వినియోగించాలని సూచించారు. ఎన్‌ఆర్‌ఐలు సాయం అందించడానికి ఆన్‌లైన్ విధానాన్ని చేపట్టాలని అన్నారు. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ… గిరిజన ప్రాంతాల్లో స్కూళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ…. గతంలో స్కూలు యూనిఫామ్స్‌కు చాలీచాలని విధంగా క్లాత్ ఇచ్చారని, 3 జతలకు సరిపడా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ… వైసీపీ పాలనలో ప్రభుత్వ స్కూళ్ల ఇమేజ్ పడిపోయిందని తెలిపారు. స్కూళ్లు, కళాశాలల్లో వార్షికోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ…. అదనపు తరగతి గదుల నిర్మాణానికి కాంప్రెహెన్సివ్ ప్లాన్ అమలుచేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ… సంస్కరణల అమలులో తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలని కోరారు.