అమరావతి (చైతన్య రథం): అమెరికాలోని ప్లోరిడా, తంపాలో ఈ ఏడాది జూలై 4 నుంచి 6 వరకు జరిగే నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఎనిమిదవ అమెరికా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని రాష్ట్ర ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు ఆహ్వానించారు. ఈమేరకు అమరావతిలోని ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల మంత్రి కార్యాలయంలో బుధవారం ఆయనను ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యులు కలిశారు. ఈ ఉత్సవాల్లో తప్పనిసరిగా పాలుపంచుకోవాల్సిందిగా నాట్స్ ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ సందర్భంగా నాట్స్ అధ్యక్షులు మందాడి శ్రీహరి, గుత్తికొండ శ్రీనివాస్, పిన్నమనేని ప్రశాంత్ తదితరులు మంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.