మచిలీపట్నం (చైతన్యరథం): గిరిజనుల సంక్షేమం కోసం 7,557 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని, ఆదివాసీలలో చైతన్యం తీసుకువచ్చి వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం మచిలీపట్నం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి రవీంద్ర తొలుత అధికారులతో కలిసి ఏకలవ్యుడు, స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఎస్టీల ఆరాధ్యదైవం సేవాలాల్, చెంచులక్ష్మి, వెన్నెలకంటి రాఘవయ్యల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం 7,557 కోట్ల రూపాయల వ్యయంతో అనేక పథకాలు అమలు చేస్త్తోందన్నారు. ఐటీడీఏల ద్వారా గిరిజనుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వం పథకాలను, కార్యక్రమాలను గిరిజనులు అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. మచిలీపట్నం మండలంలోని నారాయణపురం కాలనీకి జిల్లా కలెక్టర్‌తో కలిసి వెళ్లిన సమయంలో అక్కడ ఎస్టీలకు ఆధార్ కార్డులు లేవనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అప్పటినుండి వారికి ఆధార్ కార్డులు ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఒక్కో గిరిజన కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేసి వారిని ఆదుకుంటున్నామన్నారు. గిజనుల ఇళ్లపై పీఎం సూర్యా ఘర్ పథకం కింద సౌర ఫలకాలను పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.