అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ న్యాయ, మైనారిటీ సంక్షేమ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ ఉమ్రా యాత్రకు శుక్రవారం రాత్రి బయలుదేరుతున్నారు. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా, మదీనా ప్రార్థన మందిరాలను సందర్శించి అనంతరం 18న మంత్రి ఫరూక్ తిరిగి రానున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్రా యాత్రకు బయలుదేరుతున్న మంత్రి ఫరూక్‌ను మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య అధికారులు, ఇంకా పలువురు ముఖ్యులు అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్రా యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకొని రావాలని ఆకాంక్షిస్తూ దువా చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు కోసం, శాంతి సౌభాగ్యాల కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఉమ్రా యాత్రలో ప్రార్థిస్తానని పేర్కొన్నారు.
చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి: మంత్రి ఫరూక్
జీవనమార్గంలో ఏ రంగంలో రాణించాలన్నా చదువుతోనే సాధ్యమని న్యాయ, మైనార్టీ సంక్షేమ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ అన్నారు. గురువారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో భారతదేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలిగా, ఆదర్శప్రాయురాలిగా నిలిచిన షేక్ ఫాతిమా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. షేక్ ఫాతిమా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం మంత్రి ఫరూక్ మాట్లాడారు. మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలతో షేక్ ఫాతిమా కలిసి పని చేశారన్నారు. బాలికా విద్య కోసం అహర్నిశలు కృషిచేసిన భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలిగా షేక్ ఫాతిమా కార్యాచరణ అమలులో ఎన్నో ఇబ్బందులకు, భౌతిక దాడులకు కూడా గురైనప్పటికీ తాను అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసిన ఘనత సొంతం చేసుకుని భావితరాలకు ఆదర్శప్రాయురాలిగా నిలిచిందన్నారు.
మైనారిటీ వర్గాలు, ప్రజలందరూ చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. చదువుతోనే తాము అనుకున్న రంగంలో ఉన్నతస్థాయిలోకి చేరేందుకు మార్గం సులభతరం అవుతుందన్నారు. రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. బాలిక విద్య కోసం ఎంతో కృషి చేసిన షేక్ ఫాతిమా సేవలను ప్రభుత్వం 8వ తరగతి పాఠ్యపుస్తకాల్లో చేర్చి తగిన గౌరవం కల్పించిందన్నారు.
ఉరుసు వేడుకలకు హాజరైన మంత్రి ఫరూక్
విజయవాడ సమీపంలోని కొండపల్లి గ్రామంలో జరిగిన హజరత్ సయ్యద్ షా బొఖారి 428వ ఉరుసు- ముబారక్ ఉరుసు మహోత్సవం తొలిరోజు కార్యక్రమానికి న్యాయ మైనారిటీ సంక్షేమ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ హాజరయ్యారు. మూడు రోజులపాటు ఉరుసు మహోత్సవాన్ని నిర్వాహకులు పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. పురాతన దర్గాను సందర్శించిన మంత్రి ఫరూక్ చాదర్‌ను సమర్పించారు. కార్యక్రమంలో ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ, పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.