ఒంగోలు (చైతన్యరథం): వేడిపాలు ఒంటిమీద మడటంతో గాయపడి ఒంగోలు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల విద్యార్థిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గురువారం నాడు పరామర్శించారు. టంగుటూరు మహాత్మజ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 5 తరగతి విద్యార్ధి మధుమోహన్ వేడిపాలు మీద పడి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న మంత్రి అధికారులతో మాట్లాడి విద్యార్థిని ఒంగోలు కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని మంత్రి డోలా పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని, సీఎంఆర్.ఎఫ్ నిధులతో విద్యార్థికి మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి తెలిపారు. అధికారులు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే చర్యలు తప్పవని మంత్రి డోలా హెచ్చరించారు.