- జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్
- సింగిల్ ప్లాట్ ఫామ్‌గా నైపుణ్యం పోర్టల్
- ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంటర్ వృత్తి విద్యల బలోపేతంతో ఉద్యోగాల కల్పన
- లక్ష్యసాధనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి
- నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం
ఉండవల్లి (చైతన్యరథం): నైపుణ్యాభివృద్ధి విభాగాల ద్వారా రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాల కల్పనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఉండవల్లి నివాసంలో నైపుణ్యాభివృద్ధి శాఖపై అధికారులతో మంగళవారం మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధి శాఖలోని స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, న్యాక్, సీడాప్, ఓంక్యాప్ విభాగాలు కలిసికట్టుగా పనిచేసి యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. నైపుణ్యం పోర్టల్‌ను సింగిల్ ప్లాట్ ఫామ్‌గా తీర్చిదిద్ది.. యువత, పరిశ్రమలను అనుసంధానపరిచే విధంగా సమర్థవంతంగా రూపొందించాలన్నారు. నైపుణ్య శిక్షణ.. తద్వారా జరిగే ఉద్యోగ కల్పనను రంగాల వారీగా ట్రాక్ చేయాలని చెప్పారు.
జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్
కర్నూలును రెన్యువబుల్ ఎనర్జీ కేంద్రంగా.. చిత్తూరు, కడపను ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా రూపొందిస్తాం. గోదావరి జిల్లాలను ఆక్వా హబ్‌గా మారుస్తాం. అనంతపురం జిల్లాను ఆటోమొబైల్ మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చేస్తాం. ప్రకాశం జిల్లాను బయోఫ్యూయల్ హబ్‌గా మారుస్తాం. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆయా కోర్సుల్లో యువతకు నైపుణ్య శిక్షణ అందించాలి. ఏపీలో భోగాపురం ఎయిర్ పోర్ట్, రాజధాని అమరావతి నిర్మాణం, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రావడం వల్లే కలిగే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా యువతకు శిక్షణ ఇవ్వాలి. ఇందులో ముఖ్యంగా న్యాక్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణరంగ నైపుణ్యాలను అందించే విధంగా కోర్సులు రూపొందించాలని ఆదేశించారు. ఐటీలో వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. భవిష్యత్‌లో విమానయాన రంగం, ఆక్వా, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్, కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఏసీ మెకానిక్‌లు, లిఫ్ట్ ఆపరేటర్లు, సోలార్ టెక్నీషియన్ల కొరత ఉంది. అధికారులు ఆయా రంగాల్లో ఉద్యోగ, ఉపాధి కల్పనపై దృష్టి కేంద్రీకరించాలి. జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు.
ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంటర్ వృత్తి విద్యల బలోపేతం
ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంటర్ వృత్తి విద్యల బలోపేతానికి పేరెన్నికగన్న పరిశ్రమల ద్వారా కరిక్యులమ్‌ను రూపొందించి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్‌ను అందించడం ద్వారా ఉద్యోగాల కల్పనకు కృషిచేయాలి. ఇంటర్‌తో పాటు ఇంజనీరింగ్ కరిక్యులమ్‌ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు. పాఠశాల మధ్యలోనే చదువు నిలిపివేసిన ప్రతిఒక్కరిని ట్రాక్ చేసి, వారు కోరుకున్న విధంగా నైపుణ్య శిక్షణను అందించి నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ ప్రకారం మరిన్ని ఉపాధి అవకాశాలు పొందే విధంగా కోర్సులు రూపొందించాలని ఆదేశించారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ఫైనాన్షియల్ లిటరసీ, వ్యవసాయం, ఇతర వృత్తుల పట్ల అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే కాలేజీ, యూనివర్సిటీ స్థాయిల్లోనే విద్యార్థులకు తగిన నైపుణ్యాలను అందించి ఉద్యోగాలు పొందే సామర్థ్యాన్ని పెంపొందించాలని ఆదేశించారు.
సమావేశంలో సీడాప్, ఓమ్ క్యాప్, న్యాక్ విభాగాలపైనా సమగ్రంగా సమీక్షించారు. ఆయా విభాగాలు ప్రతి ఏడాది అందించవలసిన ఉద్యోగ కల్పన లక్ష్యాలను, ఇతర కేపీఐ(కీ ఫెర్ఫార్మింగ్ ఇండికేటర్స్)ను రూపొందించాలని సూచించారు. సీడాప్ ద్వారా కల్పించే రెసిడెన్షియల్ ట్రైనింగ్‌ల్లో నాణ్యతను పాటిస్తూ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేసి వందశాతం ఉద్యోగాల కల్పన సాధించాలని ఆదేశించారు. అదేవిధంగా ఓమ్ క్యాప్ ద్వారా విదేశాల్లో ఉద్యోగ అవకాశాల పట్ల యువతకు అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం కార్యదర్శి కోన శశిధర్, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ, సీఈవో జి.గణేష్ కుమార్, కాలేజి ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృతికా శుక్లా, సీడాప్ ఛైర్మన్ దీపక్ రెడ్డి, సీడాప్ సీఈవో నారాయణ స్వామి, ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ అండ్ మొబిలిటీ అడ్వైజర్ సీత శర్మ, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.