అమరావతి (చైతన్య రథం): మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలోనే జీవో జారీ చేశామని, జూన్‌నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని వివరించింది. మంగళవారం నిర్వహించిన కార్యదర్శుల సమావేశంలో విద్యాశాఖపై ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జీవో 117కు త్వరలో ప్రత్యామ్నాయం తెస్తామన్నారు. గతంలో టీచర్లకు 45 రకాల యాప్‌లు ఉండేవని, వాటిని ఒక్క యాప్‌లోకి మార్చామన్నారు. త్వరలో టీచర్ బదిలీల చట్టం తెస్తామని, అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లు పెట్టే అవకాశం ఉందన్నారు. వీసీల నియామకం తర్వాత రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకూ ఏకీకృత చట్టం అమలు చేస్తామని శశిధర్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.