- ఆర్థికంగానూ రాష్ట్రం పరిపుష్టం
- ఇంటికో పారిశ్రామిక వేత్త..ఆలోచన సాకారం
- మంత్రులు అనగాని, గొట్టిపాటి ఉద్ఘాటన
- పెద్దాపురం నియోజకవర్గంలో రూ.13 కోట్లతో ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు శంకుస్థాపన
పెద్దాపురం (చైతన్యరథం): రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించటమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఏడీబీ రోడ్డు వద్ద ఏపీఐఐసీ ఆధ్వర్యంలో రూ.13 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు మంగళవారం పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్పతో కలిసి మంత్రులు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్తు తరాల కోసం ఆలోచించే నాయకుడన్నారు. ఉపాధి కల్పనతో పాటు ఆర్థికంగా రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలిపేందుకు.. ప్రతి కుటుంబంనుంచి ఒక పారిశ్రామిక వేత్త.. అనే నినాదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చారన్నారు. దీనిని సాకారం చేయడం కోసమే ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో ప్రతి ఇంటికి ఒక ఐటీ ఉద్యోగి అని చంద్రబాబు పిలుపునిస్తే చాలా మంది ఎగతాళి చేశారని కానీ, ఆ ఫలితాలను మనం గత 20 ఏళ్లలో చూశామన్నారు. విజన్-2047 ద్వారా స్వర్ణాంధ్ర సాధించాలంటే పారిశ్రామిక రంగంలోనూ ప్రగతి చాలా అవసరం అన్నారు. ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు కారణంగా ఉపాధి కల్పన జరగడమే కాకుండా ఆర్థికంగానూ రాష్ట్రం పరిపుష్టం అవుతుందన్నారు. పారిశ్రామిక వేత్తలుగా మారే యువతను ప్రోత్సహించేందుకు పెట్టుబడి నిధిలో, విద్యుత్ బిల్లుల్లో, అనేక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తోందని మంత్రి అనగాని తెలిపారు.
పారిశ్రామికాభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి: మంత్రి గొట్టిపాటి
మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందన్నారు. వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్ ఇండియా పిలుపు మేరకు స్థానికంగానే పరిశ్రమ స్థాపించి పదిమంది యువతకు ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణం చేపడుతోందని తెలిపారు.
పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప మాట్లాడుతూ పెద్దాపురంలో 29 ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పార్కు ద్వారా 5వేల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో పెద్దాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసే పార్కు అతిపెద్దదన్నారు. సుమారుగా 29 ఎకరాల్లో రూ.13కోట్ల వ్యయంతో ఈ పార్కు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ పార్కును ప్లాట్లుగా విభజించి పరిశ్రమ స్థాపనకు అవసరమైన రోడ్లు, విద్యుత్, నీరు వంటి ఇతర వసతులన్నీ ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న సంవత్సర కాలంలో నిర్మాణ పనులు పూర్తి చేసి ఈ పార్కును అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజా, పెద్దాపురం ఆర్డీవో కె.శ్రీరమణి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎం.రమణారెడ్డి, డీఎల్డీవో కెఎన్వీ.ప్రసాద్ రావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.