అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాల సమన్వయకర్తగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు నియమితులయ్యారు. రాజుకు సహయ మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2002 నుంచి 2007 వరకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి కార్యక్రమాల సహ సమన్వయకర్తగా, అనేక కార్యక్రమాల్లో మీడియా సమన్వయకర్తగా రాజు పనిచేశారు. 2017-2023 మధ్య కాలంలో ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న రాజు పార్టీలో వివిధ పదవులు నిర్వహించారు. 2007-2013 మధ్య కాలంలో తెలుగుయువత కార్యాలయ కార్యదర్శిగా.. ఆ తర్వాత 2013లో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా వ్యవహరించి పార్టీ అధినేత చంద్రబాబు అప్పజెప్పిన పనులను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సమయంలో చంద్రబాబు నిర్వహించిన వస్తున్నా మీ కోసం పాదయాత్రలో రాజు వాలంటీర్ల సమన్వయకర్తగా పని చేసి పాదయాత్ర సజావుగా సాగేలా తన వంతు పాత్ర పోషించారు. 2017లో శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. శాసనమండలిలో ప్రజా సమస్యలను.. పార్టీ గళాన్ని గట్టిగా వినిపించారు. మూడు రాజధానులపై శాసనమండలిలో చట్టం చేసేందుకు గత ప్రభుత్వం పన్నిన కుట్రను యువనేత లోకేష్ సారధ్యంలో సమర్థవంతంగా తిప్పికొట్టారు. మూడు రాజధానుల బిల్లు పాస్ కాకుండా అడ్డుకోవడంలో సత్యనారాయణ రాజు తన వంతు పాత్ర పోషించారు. ఇక టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసన మండలిలో నారా లోకేష్ మీదకు నాటి అధికార పార్టీ నేతలు దూసుకొచ్చిన సమయంలో లోకేష్ మీద దాడి జరగ్గకుండా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్‌తో కలిసి అడ్డుకున్నారు. 2022 నుంచి పార్టీ కార్యక్రమాల సమన్వయకర్తగా వ్యవహరిస్తూ చంద్రబాబు కార్యక్రమాలను కో-ఆర్డినేట్ చేసుకుంటూ..వాటిని సక్సెస్ అయ్యేలా చేశారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల సమన్వకర్తగా వ్యవహరించారు. పార్టీకి అత్యంత విధేయుడిగా ఉన్న రాజును తన కార్యక్రమాల సమన్వయకర్తగా నియమించి ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవించారు. దాదాపు 10 మహానాడుల్లో వలంటీర్ల కో-ఆర్డినేటర్ గా వ్యవహరిచడం సత్యనారాయణ రాజు ప్రత్యేకత.