- నూజివీడు మామిడికి పూర్వవైభవం తీసుకొస్తాం
- రూ.30 కోట్లతో మార్కెట్ యార్డు అభివృద్ధికి చర్యలు
- వారికి డ్రిప్ ఇరిగేషన్, బీమా, సబ్సిటీ రుణాలు
- నాణ్యత పెంచుకుంటేనే అధిక లాభాలు సాధ్యం
- పరిశోధనలు రైతులకు లాభసాటిగా ఉండాలి
- గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి
నూజివీడు(చైతన్యరథం): నూజివీడు మామిడికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల మంత్రి కొలుసు పార్థసారథిó తెలిపారు. పట్టణంలోని నాగేంద్ర వరలక్ష్మి కల్యాణ మండపంలో సోమవారం మామిడి పరిశోధన కిసాన్ మేళా వర్క్‌షాప్ జరిగింది. ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొన్నారు. మామిడి పరిశోధన, మార్కెటింగ్ సౌకర్యాలు, ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ నూజివీడు మామిడికి మరింత ప్రాధాన్యం చేకూర్చి రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు రూ.30 కోట్లతో నూజివీడు మార్కెట్ యార్డ్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. రైతులు మామిడి నాణ్యత పెంచితే ఎయిర్ కార్గో సేవలు కూడా అందుబాటులోకి తెస్తామని వెల్లడిరచారు. మామిడి రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. నూజివీడు మామిడికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, కానీ ఇటీవ ల కాలంలో నాణ్యమైన దిగుబడులు రాకపోవడంతో రైతులు ఆర్థికంగా ఎంతగానో నష్టపోతున్నారన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, రైతాంగ సంక్షేమానికి సబ్సిడీతో కూడిన పథకాలను అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం విస్మరించిన మామిడి పంటకు భీమా పథకాన్ని త్వరలో అమలు చేస్తామని మంత్రి చెప్పారు. నూజివీడు మామిడి ఇమేజ్ మరింత పెంచేందుకు నాణ్యమైన మామిడి పంటకు రైతులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి లోకేష్ పాదయాత్రలో నూజివీడు ప్రాంతంలోని మామిడి రైతులు తమ సమస్యలు తెలపగా వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, హామీని నిలబెట్టుకుంటూ మార్కెట్ యార్డులో రూ.30 కోట్లతో సదుపాయాలు ఏర్పా టు చేస్తున్నామని తెలిపారు.
నాణ్యమైన మామిడి దిగుబడికి ఉద్యానవన, మార్కెటింగ్, మామిడి పరిశోధన శాస్త్రవేత్తలు, రైతులతో కలిసి కమిటీ నియమించి నూజివీడు మామిడికి పూర్వవైభవం వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మామిడి రైతు ల ఆర్థికాభివృద్ధికి మెరుగైన రవాణా సౌకర్యాలు, నాణ్యమైన మామిడిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఎయిర్ కార్గో సేవలు కూడా రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు. మామిడి రైతులకు లాభాలు పెంచడానికి ఉపయోగ పడేలా పరిశోధ నలు ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. మామిడి రైతుల కష్టాలు తీర్చడానికి కూట మి ప్రభుత్వం బీమా ప్రవేశపెట్టిందని తెలిపారు, మామిడి రైతులకు సబ్సిడీ రుణాలు కూడా అందజేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మామిడి పరి శోధన కేంద్రంలో అవసరమైన సిబ్బందిని ప్రభుత్వంతో చర్చించి తాత్కాలిక పద్దతిలో నియమించాలని సూచించారు. మామిడి పంటతో పాటు అంతర పంటను వేస్తే లాభసాటిగా ఉంటుందని దానిపై దృష్టి పెట్టాలని సూచించారు. విదేశాలకు మామిడి ఎగుమతి చేసే ప్రైవేట్ ఎక్స్‌పోర్ట్ సంస్థలకు ప్రభుత్వం అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు. డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందని, దానిని మామిడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు, మామిడి కాయలకు కవర్లు 60 శాతం సబ్సిడీ అందిస్తుందని వాటిని వినియోగించుకుంటే అధిక రాబడి పొంద వచ్చని తెలిపారు. ప్రభుత్వంతో మాట్లాడి ఎయిర్ కార్గో త్వరలో ఏర్పాటు చేస్తా నని, వచ్చే ఏడాది కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.