- ఉత్కంఠ భరితంగా ఫైనల్ మ్యాచ్
- విజేతలకు బహుమతులు అందజేసిన భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు
- ప్రథమ బహుమతి రూ. 3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ. 2 లక్షలు, తృతీయ బహుమతి రూ. లక్ష
మంగళగిరి (చైతన్యరథం): ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోని మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ప్రీమియర్ లీగ్, సీజన్-3 పోటీల్లో గుంటూరు జిల్లా జట్టు విజేతగా నిలిచింది. గుంటూరు వర్సెస్ నెల్లూరు మధ్య గురువారం ఉత్కంత భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుంటూరు జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట టీడీపీ నాయకులు ఇరు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకోని జాతీయ గీతాలాపనతో ఫైనల్ మ్యాచ్‌ను ప్రారంభించారు.
గెలుపొందిన విజేతలకు భారత మాజీ క్రికెటర్ అబంటి రాయుడు, ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) కోశాధికారి దండమూడి శ్రీనివాస్, ఏసీఏ అపెక్స్ కమిటీ కౌన్సిల్ మెంబర్ దంతు గౌరు విష్ణు తేజ్, సేల్ కంపెనీ యాజమాని రాఖి గిల్, సక్కు గ్రూపు అధిపతి ధర్మతేజ, ఉషోదయ సంస్థ అధిపతి యుగంధర్‌ల చేతులు మీదగా నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు.
ఫైనల్ మ్యాచ్‌తో క్రికెట్ స్టేడియం సందండిగా మారింది. పోటీలను తిలకించేందుకు యువత, క్రీడాభిమానులు, ప్రజలు, మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ నెల 12 వ తేదీ నుంచి 23 తేదీ వరకు పోటీలను అద్భుతంగా నిర్వహించిన నిర్వాహకులను అంబటి రాయుడు అభినందించారు. ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుంటూరు జట్టు నెల్లూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన గుంటూరు జట్టు 18.4 ఓవర్లలో 161 పరుగులు చేసి నెల్లూరుపై గెలుపొందింది. 48 పరుగులు చేసి 5 వికెట్లు తీసిన మహిప్ కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నారు.
తృతీయ స్థానం కోసం కడప వర్సెస్ విజయనగరం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కడప జట్టు విజయం సాధించింది. 23 బంతుల్లో 50 పరుగులు చేసిన ధృవ కుమార్ రెడ్డి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈవెంట్ స్పాన్సరర్లుగా సేల్, సక్కు, మార్కోరోస్, ఉషోదయ సంస్థలు వ్యవహరించాయి. ప్రతి మ్యాచ్‌ను గోపి టీవీ యూట్యూబ్ ఛానల్, వీ డిజిటల్ ద్వారా నిరంతరయంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ప్రీమియర్ లీగ్, సీిజన్-3 పోటీలలో విజేతగా నిలిచిన గుంటూరు జట్టుకు కొమ్మారెడ్డి కిరణ్ సహకారంతో రూ 3 లక్షలు నగదు బహుమతి అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన నెల్లూరు జట్టుకు రూ. 2 లక్షలు కాట్రగడ్డ మధుసూదన్ రావు, తృతీయ స్థానంలో నిలిచిన కడప జట్టుకు రూ. లక్ష నగదును పల్నాటి నాగేశ్వరరావు, అమిరిశెట్టి సాంబశివరావు సహకారంతో నగదు బహుమతి అందజేశారు. మొదటి మ్యాచ్ నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు ప్రతి మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన క్రీడాకారుడికి తెలుగు యువత అధ్యక్షులు భోగి వినోద్, మంగళగిరి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కనికళ్ళ చిరంజీవి సహకారంతో ఒక్కోక్కరికీ రూ 10 వేలు చొప్పున నగదు బహుమతి అందజేశారు. అలాగే 10 వికెట్లు తీసి 159 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన కె మహిప్ కుమార్ కు రూ. 50 వేలు బత్తుల హరిదాస్, 219 పరుగులుచేసి బెస్ట్ బ్యాట్స్‌మెన్ గా ఎం వాసుదేవరాజుకు రూ 25 వేలు కాసరనేని జస్వంత్, 11 వికెట్లు తీసి బెస్ట్ బౌలర్‌గా నిలిచిన గిరిష్ కు రూ 25 వేలు తాడిపత్రి అజయ్ కుమార్ సహకారంతో నగదు బహుమతులు అందజేశారు. 187 పరుగులు చేసి 4 క్యాచ్‌లు పట్టుకొని బెస్ట్ వికెట్ కీపర్ గా నిలిచిన సోహన్ వర్మకు మాత్రపు జెస్సీ రాజు సహకారంతో రూ 15 వేలు నగదు బహుమతి అందజేశారు. అన్ని మ్యాచ్‌ల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి మంత్రి నారా లోకేష్ సహకారంతో టీ షర్టులు, ప్యాంట్లు అందజేశారు. పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన పలువురు క్రీడాకారులకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు బహుకరించారు.
ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలోని యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో మంత్రి నారా లోకేష్ ఎంతో ఖర్చుతో కూడిన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం టోర్నమెంట్లను నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీలోనే క్రీడాకారులు ప్రాక్టీస్ చేయడానికి సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. క్రీడాకారులు పోటీల్లో రాణించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని కోరారు. క్రీడాకారులకు అవసరమైన కాన్ఫిడెన్స్‌ను కోచ్‌లు ఇవ్వాలన్నారు. కాన్ఫిడెన్స్ ను మించిన స్కిల్ మరొకటి లేదన్నారు. ప్రాక్టీస్‌కి మ్యాచ్ కి మధ్య తేడా తెలిసినప్పుడు క్రీడాకారులు విజయవంతం అవుతారన్నారు. రానున్న రోజుల్లో ఏపీ నుంచి ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ఆడనున్నారని చెప్పారు. ప్రతి క్రీడాకారుడు ప్రాక్టీస్‌తో పాటు మైండ్ ఫ్రెష్‌గా ఉంచుకోవాలని సూచించారు. ఏపీలో క్రీడా రంగం మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్, కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.