- ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు
- మంత్రి లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని టోర్నీ నిర్వహణ
- నియోజకవర్గ చరిత్రలో లేని విధంగా నవులూరు క్రికెట్ స్టేడియంలో భారీస్థాయిలో పోటీలు
- విజేతలకు రూ.3, రూ.2, రూ లక్ష నగదు బహుమతులు ప్రదానం
- మ్యాన్ ఆఫ్ ది సిరీస్, బెస్ట్ బ్యాట్స్‌మెన్, బెస్ట్ బౌలర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు నగదు బహుమతులు
- మంత్రి లోకేష్ సహకారంతో ప్రతి ఏటా క్రికెట్ టోర్నమెంట్
మంగళగిరి (చైతన్యరథం): రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో ఈ నెల 12వ తేదీ నుంచి 23 వరకు మంగళగిరిలో ప్రీమియర్ లీగ్, సీజన్-3 రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో మంత్రి లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన సహకారంతో క్రికెట్ టోర్నమెంట్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ సారి నవులూరులోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రీమియర్ లీగ్ పోటీలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి 13 టీమ్‌లు, మంగళగిరి నియోజకవర్గం నుండి ఒక జట్టు ప్రీమియర్ లీగ్, సీజన్ -3 పోటీలలో పాల్గొంటున్నాయి. ఇప్పటికే టోర్నమెంట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు.
మంగళగిరి నియోజకవర్గ యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసీ వారిని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు మంత్రి నారా లోకేష్ తన సొంత ఖర్చులతో వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ క్రీడాకారుల కోసం ఇప్పటికే తాడేపల్లి, మంగళగిరిలో రెండు క్రీడా మైదానాలను కూడా ఆయన ఏర్పాటు చేశారు. ప్రీమియర్ లీగ్, సీజన్-3 పోటీలలో ప్రథమ బహుమతి కింద రూ. 3 లక్షలు, ద్వితీయ బహుమతి కింద రూ. 2 లక్షలు, తృతీయ బహుమతి కింద రూ. లక్ష నగదు బహుమతులు ప్రదానం చేయనున్నారు. అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కింద రూ. 50 వేలు, బెస్ట్ బ్యాట్స్‌మెన్‌కు రూ. 25 వేలు, బెస్ట్ బౌలర్‌కు రూ. 25 వేలు, ప్రతి మ్యాచ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కింద రూ.10 వేల నగదు బహుమతులు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.