- 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహణ
- 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా
- 6 జిల్లాల్లో 373 ఘాట్లు–రాజమండ్రిలో మోడల్ ఘాట్
- భక్తుల కోసం టెంట్ సిటీలు, హోం స్టేల ఏర్పాటు
- ప్రమాదాలు జరగకుండా పటిష్ట కార్యాచరణ
- రద్దీ క్రమబద్ధీకరణకు ఏఐ డ్రివెన్ క్రౌడ్ మేనేజ్మెంట్
- పుష్కరాల నిర్వహణపై తొలిసారి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని, ఇందుకు యంత్రాంగం సన్నద్ధం కావాలని అధికారుల ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆదేశించారు. పుష్కరాలకు ఇంకా 18 నెలల సమయమే ఉన్నందున… పనులు వెంటనే ప్రారంభించి వేగంగా కొనసాగించాలని సూచించారు. గోదావరి పుష్కర స్నానం ఆచరించేందుకు దేశ, విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో అందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్దేశించారు. సచివాలయంలో శుక్ర వారం గోదావరి పుష్కరపనులపై తొలిసారి అత్యున్నత సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పుష్కర ఏర్పాట్ల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వచ్చేఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు మొత్తం 12 రోజుల పాటు గోదావరి పుష్క రాలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో గోదావరి ప్రవహించే 212 కిలోమీటర్ల పొడవునా పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పుష్కర స్నానాలకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. నిధుల కోసం ఇప్పటి నుంచే కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు.
ఘాట్ల సామర్ధ్యం పెంపు
భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా వసతి సమస్యను తీర్చేలా టెంట్ సిటీలను… హోం స్టేలను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. పుష్కర ఘాట్లల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఘాట్లలో రద్దీని ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించేలా చూడాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఘాట్ల సామర్థాన్ని కూడా. పెంచుకోవాల్సి ఉందన్నారు. స్నాన ఘాట్లలో రాకపోకలకు సంబంధించి రూట్ మేనేజ్ మెంట్ రూపొందించాలని సూచించారు. వాహనాలు ఘాట్ల వరకు రాకుండా పార్కింగ్ ప్రాంతాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు, వాహన రద్దీ, టెంట్ సిటీలో అగ్ని ప్రమాదాలు లాంటి ఘటనలు తలెత్తకుండా పక్కాగా భద్రతా చర్యలు చేపట్టాలని ఇందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ క్రౌడ్ మేనేజ్మెంట్ని, ఆర్టీజీఎస్ సేవలను వినియోగించుకోవాలన్నారు. భద్రతా చర్యలు, సేవల విషయంలో ఎక్కడా మానవ ప్రయత్నంలో లోటు పాట్లు ఉండకూడదని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి భక్తులు వచ్చేందుకు వీలుగా రహదారులన్నీ అభివృద్ధి చేయాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అత్యధికంగా కోనసీమ జిల్లాలో 175 ఘాట్లు
ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు కొత్తగా మరో 139 ఘాట్లు… మొత్తం కలిపి 373 ఘాట్లు 9,918 మీటర్ల పొడవున అభివృద్ధి చేసేలా ప్రణాళికలకు రూపకల్పన చేసినట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. పోలవరం జిల్లాలో 14, ఏలూరు జిల్లా 34, తూర్పుగోదావరిలో 102, పశ్చిమ గోదావరి 40, కాకినాడ జిల్లా 6, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ 175 ఘాట్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రాజమహేంద్రవరంలో ముందుగా మోడల్ ఘాట్ నిర్మించి… ఆ డిజైన్ల ఆధారంగా మిగిలిన ఘాట్ల నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు. ప్రస్తుతం ఉన్న ఘాట్ల సామర్థ్యాన్ని కూడా పెంచాలని నిర్దేశించారు. పుష్కరాలకు సన్నద్ధతగా కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించాలని చెప్పారు. సమీక్షలో ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సీఎం అఖండ గోదావరి పేరుతో గోదావరి పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు… పర్యాటక, చారిత్రాత్మకమైన ప్రదేశాలకు ప్రాచుర్యం కల్పించాలన్నారు. పోలవరం వంటి ఏజెన్సీ ప్రాంతాల్లోని ఘాట్లకు సెల్ సిగ్నల్స్ సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పుష్కరాలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారిని ఆదరించి ఆతిథ్యం ఇచ్చేలా స్థానిక ప్రజల నుంచి సహకారం తీసుకోవాలని ప్రజా భాగస్వామ్యంతోనే పుష్కరాలు విజయవంతం అవుతాయని సీఎం అన్నారు.
పుష్కరాలకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా కనెక్టివిటీ
ఇటీవల జరిగిన మహా కుంభమేళాలో వినియోగించినట్టే ఏఐ బేస్డ్ టెక్నాలజీని గోదావరి పుష్కరాలకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. భాషిణి యాప్ ద్వారా అన్ని భాషల భక్తులకు సేవలు అందించగలగాలని చెప్పారు. పారిశుధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పుష్కరాలకు వచ్చేవారి కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని… కేంద్రంతో. మాట్లాడి రైళ్లు, విమాన సర్వీసులు అదనంగా నడిపేలా చూడాలన్నారు. పుష్కరాలు నిర్వహించే అన్ని ఘాట్లను, ప్రసిద్ధ క్షేత్రాలను, సమీప ఖాళీ స్థలాలు, ఇతర మౌలిక వసతులను మ్యాపింగ్ చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాలపై సమీక్షకు ముందు సీఎంకు వేద పండితులు ఆశీర్వచనం పలికారు. దీనిపై సీఎం స్పందిస్తూ ముఖ్యమంత్రిగా 3వ మారు గోదావరి పుష్కరాలు నిర్వహించడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. సమీక్షకు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నారాయణ, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, బీసీ జనార్థన్ రెడ్డి, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు.















