- పెట్టుబడిదారులకు పూర్తి సహకారం
- పర్యాటక రంగంలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యం
- పర్యాటక పెట్టుబడిదారుల సదస్సులో మంత్రి దుర్గేష్
- నూతన పర్యాటక పాలసీ ఆవిష్కరణ
విజయవాడ (చైతన్యరథం): కూటమి ప్రభుత్వంలో పరిశ్రమ హోదాతో పర్యాటక రంగానికి మహర్దశ వచ్చిందని, సమగ్ర పర్యాటక విధానంతో రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ వెల్లడిరచారు. మంగళవారం విజయవాడలోని హోటల్ వివంతలో సీఐఐ, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతుతో స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన పర్యాటక పెట్టుబడిదారుల సదస్సులో మంత్రి కందుల దుర్గేష్ 2024-29 కాలానికి నూతన పర్యాటక పాలసీని ఆవిష్కరించారు. పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టేందుకు దాదాపు 200 మందికి పైగా పెట్టుబడిదారులు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కొత్త పర్యాటక పాలసీ విధివిధానాలు, పర్యాటక అభివృద్ధికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాల గురించి టూరిజం సెక్రటరీ వి.వినయ్ చంద్, ఎండీ కాట ఆమ్రపాలి కూలంకషంగా వివరించారు.
ఒక్కొక్క ఇన్వెస్టర్‌తో మంత్రి కందుల దుర్గేష్, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, టూరిజం సెక్రటరీ వి.వినయ్ చంద్, ఎండీ ఆమ్రపాలి కాట, ఈడీ పద్మావతి.. ప్రత్యేకంగా మాట్లాడి వారి ప్రతిపాదనలు స్వీకరించారు. రాష్ట్రంలో ఏయే ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి ఉందో అడిగి తెలుసుకొని సాధ్యాసాధ్యాలను వివరించారు. స్పష్టమైన, సహేతుకమైన ప్రతిపాదనలతో రావాలని పెట్టుబడిదారులకు సూచించారు. ఏ విధమైన సమాచారం కావాలన్నా తనతో సహా ఏపీటీడీసీ చైర్మన్, ఉన్నతాధికారులు అందరూ అందుబాటులో ఉంటారని మంత్రి దుర్గేష్ తెలిపారు.
పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి
మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని, పెట్టుబడిదారులు నిర్భయంగా పెట్టుబడి పెట్టొచ్చని ఇన్వెస్టర్లకు ధైర్యమిచ్చారు. గతంలో రాజకీయ చిత్తశుద్ధి లేక పర్యాటక రంగం కుంటుపడిరదని, ప్రస్తుతం ఇన్వెస్టర్లకు ప్రభుత్వ సహకారం మెండుగా ఉంటుందని, సరైన వాతావరణం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని భరోసానిచ్చారు
రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు, వనరులున్న నేపథ్యంలో వాటన్నింటిని సమర్థవంతంగా వినియోగించుకొని పర్యాటక రంగంలో ఏపీని దేశంలో అగ్రపథాన నిలుపుతామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల దిశానిర్దేశంలో పర్యాటక రంగంలో రూ. 25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్న ధ్యేయంతో ముందుకు సాగుతున్నామన్నారు. పర్యాటకాన్ని, పర్యావరణాన్ని సమ్మిళితం చేసి యువతకు ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. టూరిజం సర్క్యూట్‌లు, యాంకర్ హబ్‌లు, థీమాటిక్ అప్రోచ్ ఏర్పాటు, అంతర్జాతీయ మౌలిక వసతుల కల్పనతో సందర్శనకు వచ్చిన పర్యాటకుడు కనీసం మూడు, నాలుగు రోజులు అక్కడే గడిపే విధంగా వసతులు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని హోటళ్లలో గదుల సంఖ్యను 50 వేలకు పెంచేలా కృషి చేస్తామన్నారు. ఒకే తరహా పర్యాటకాభివృద్ధి కాకుండా టెంపుల్, ఎకో, వెల్‌నెస్, విలేజ్, అగ్రి, అడ్వెంచర్ టూరిజంలను అభివృద్ధి చేస్తామన్నారు. గడచిన ఐదేళ్లలో కుంటుపడిన పర్యాటక రంగానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొత్త శోభ తెస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఇప్పటికే సాస్కి -2024-25 (స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్) ద్వారా అఖండ గోదావరి, గండికోట అభివృద్ధి కోసం నిధులు మంజూరయ్యాయని గుర్తుచేశారు. పర్యాటక రంగంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ అమలు చేసి దేశంలోనే ఏపీని నెంబర్ 1గా తీర్చిదిద్దుతామన్నారు. తాము ఇచ్చిన చిన్న పిలుపుతో భారీ సంఖ్యలో వచ్చిన పెట్టుబడిదారులకు మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
సుస్థిరమైన పర్యాటకాభివృద్ధి దిశగా అడుగులు
ఏపీటీడీసీ ఛైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పర్యాటకాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రణాళికాబద్ధమైన విధానాలతో సుస్థిరమైన పర్యాటకాభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిస్తామని తెలిపారు.
నూతన టూరిజం పాలసీతో అభివృద్ధి పరుగులు
నూతన టూరిజం పాలసీతో రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని టూరిజం సెక్రటరీ వి. వినయ్ చంద్ స్పష్టం చేశారు. స్థానిక జన సమూహాలను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో పాలసీ రూపొందించామన్నారు. రాష్ట్రంలోని జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, శైవ క్షేత్రాలు కలిసేలా 10 సర్క్యూట్‌లు, 25 థిమాటిక్ అప్రోచ్ లు ఏర్పాటు చేస్తామన్నారు. సీ ప్లేన్ తో పాటు కోస్టల్ టూరిజం సర్క్యూట్‌లో భాగంగా వైజాగ్, కాకినాడ, శ్రీకాకుళం, నెల్లూరు, మచిలీపట్నం ప్రాంతాల్లో 5 బీచ్ సర్క్యూట్‌లు ఏర్పాటు చేయనున్నామన్నారు. రివర్ టూరిజం, క్రూయిజ్ టూరిజం సర్క్యూట్‌లు అభివృద్ధి చేయనున్నామన్నారు. ఇప్పటివరకు రుషికొండ బీచ్‌కు మాత్రమే బ్లూఫాగ్ సర్టిఫికెట్ ఉందని, మరిన్ని బీచ్‌లను అభివృద్ధి చేసి బ్లూఫాగ్ సర్టిఫికేషన్ కోసం ప్రతిపాదనలు పంపిస్తామన్నారు.
ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పన
పర్యాటక రంగం ద్వారా ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పనకు బాటలు వేస్తామని టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట తెలిపారు. కొత్త పాలసీతో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తామన్నారు. సుస్థిరమైన అభివృద్ధి, బాధ్యాతాయుత పర్యాటకం ద్వారా అభివృద్ధి సాధించాలన్నది పాలసీ ఉద్దేశమన్నారు. 4.6 శాతం ఉన్న జీవీఏను 28 శాతానికి పెంచడం, పర్యాటక రంగంలో 12 శాతం ఉపాధిని 15 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో పాలసీ తయారుచేశామని వెల్లడిరచారు. భారతదేశానికి విదేశీ పర్యాటకులు అత్యధికంగా వచ్చే టాప్ 10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ఒకటిగా తయారుచేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నామన్నారు. పర్యాటక రంగంలో ఒక పర్యాటకుడు పెట్టే ఖర్చును 1,700 నుండి 25,000 ఖర్చు చేసే విధంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. విశాఖపట్నం, అరకువ్యాలీ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి ప్రాంతాల్లో 7 యాంకర్ హబ్‌లు ఏర్పాటు చేయనున్నామన్నారు. అమరావతి – నాగార్జున కొండ, విశాఖపట్నం- తొట్లకొండ ప్రాంతాల్లో బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని వివరించారు.
టూరిజం పాలసీ విధివిధానాలు బాగున్నాయని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి. భాస్కరరావు పేర్కొన్నారు. కొత్త టూరిజం పాలసీ పర్యాటక రంగంలో అద్భుతాలు సృష్టిస్తుందని నమ్ముతున్నామని సిఐఐ ప్రెసిడెంట్ డి. రామకృష్ణ అన్నారు. ఎంతో అధ్యయనం చేసి, మరెన్నో సమీక్ష సమావేశాల తర్వాత పర్యాటక పాలసీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూపొందించారని హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరస్వామి తెలిపారు. ఏపీలో 50వేల రూమ్స్ ఏర్పాటుకు తాము సహకరిస్తామని తెలిపారు.
మరిన్ని వివరాలు, సలహాలు, సూచనల కోసం ఎసఏaజ్‌ూసష.ఱఅ,వసశీజూఏaజ్‌ూసష.ఱఅ,జూజూజూఏaజ్‌ూసష.ఱఅ,ంa్‌ష్ట్రవa27ఏస్త్రఎaఱశ్రీ.షశీఎ ను సంప్రదించాలని వక్తలు తెలిపారు.
పర్యాటక పెట్టుబడిదారుల సమావేశంలో తాజ్, మహీంద్ర, స్టెర్లింగ్, ఇమాజికా, ప్రమాణ్, వెవెంచర్, ఎస్‌ఆర్‌ఎస్, వేద్య, ఏపీఆర్, వి ఇన్ఫోటెక్ గ్రూప్, ఐఆర్ సీటీసీ, ఐఆర్ టీఎస్, నోవాటెల్, రిపిల్, డ్రీమ్ వ్యాలీ, రహేజా, లైలా గ్రూప్, తదితర సంస్థల పెట్టుబడుదారులు, ఔత్సాహికులు, అధికారులు పాల్గొన్నారు.