- ప్రత్యక్షంగా 565 మందికి ఉద్యోగావకాశాలు
- కల్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్స్ ఏర్పాటుకు సిద్ధం
- బీసీ సంక్షేమం, చేనేత జౌళి మంత్రి సబిత
అమరావతి(చైతన్యరథం): సత్యసాయి జిల్లాలో కొత్తగా మరో పరిశ్రమ ఏర్పాటు కాబోతోందని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఒక ప్రకటనలో తెలిపారు. మడకశిర మండల కేంద్రంలోని మురారాయనహల్లి గ్రామంలో కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ ఏర్పాటుకానుందని వివరించారు. రూ.1430 కోట్లతో వెయ్యి ఎకరాల్లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. ఈ పరిశ్రమతో 565 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు, పరోక్షంగా వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఒకవైపు వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, అదే సమయం లో అభివృద్ధి కార్యక్రమాలను కూడా పెద్దఎత్తున చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహానిస్తూ భారీ ఎత్తున పరిశ్రమలు ఏర్పాటుకు కృషిచేస్తున్నామని వివరించారు. గత వైసీపీ హయాంలో వేధింపులు తాళలేక రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను వెనక్కి రప్పించడానికి సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రశంసిం చారు.