- సకాలంలో పూర్తి చేస్తాం
- ప్రతి నెలా సీఎం చంద్రబాబు సమీక్ష
- గేట్ వే అమరావతిగా అభివృద్ధి చెందుతుంది
- మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి స్పష్టీకరణ
మచిలీపట్నం (చైతన్యరథం): మచిలీపట్నం వాసుల చిరకాల వాంఛ పోర్టు నిర్మాణం అని, దానిని సకాలంలో పూర్తి చేసి మచిలీపట్నం వాసులకు అంకితం చేస్తామని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర సోమవారం పోర్టును పరిశీలించారు. పోర్ట్ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో మచిలీపట్నం పోర్టు పనులు చాలా నెమ్మదిగా జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పోర్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. పోర్టు నిర్మాణానికి ఏ విధమైన అడ్డంకులకు ఆస్కారం లేకుండా అన్ని అనుమతులు వచ్చాయన్నారు. ఇప్పటి వరకు పోర్టు నిర్మాణ పనులు 30 శాతం పూర్తయ్యాయి. నాడు తెలుగుదేశం పార్టీ చేసిన కృషితోనే నేడు ఈ పోర్టు ముందుకు సాగుతోంది. సకాలంలో పోర్టు నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించాం. ప్రతి నెల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో పోర్టు పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలోని పోర్టులకు మచిలీపట్నం పోర్టు కేంద్ర బిందువుగా ఉంది. రాజధాని అమరావతికి అతి సమీపంలో కీలకమైన పోర్టు మచిలీపట్నం. తమిళనాడు రాజధాని చెన్నె, మహారాష్ట్ర రాజధాని ముంబాయి.. పోర్టుల మాదిరిగానే అమరావతికి చేరువలో ఉన్న పోర్టు మచిలీపట్నం. భవిష్యత్తులో రాజధాని అమరావతి చేరువగా ఉంటూ.. మచిలీపట్నం పోర్టు ఏపీ ప్రయోజనాల రీత్యా వ్యూహాత్మకంగా మారనుంది. మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి భవిష్యత్తులో పుష్కలమైన అవకాశాలున్నాయి. సకాలంలో నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో పోర్టుకు సంబంధించి ఏదైనా సమస్యలు వస్తే, త్వరితగతిన పరిష్కరిస్తున్నాం. అతి త్వరలో మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి జనార్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.
4 బెర్తుల పనులు పూర్తి: మంత్రి కొల్లు
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పోర్టు నిర్మాణ స్థితిగతుల్ని ప్రజలకు తెలియజేయడంతో పాటుగా, పనులు వేగవంతం చేయడం కోసం నిత్యం పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పోర్టు పనులను చిత్తశుద్ధితో పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు 4 బెర్తుల పనులు, రోడ్డు పనులు, విజయవాడకు అనుసంధానించే పనులు 43 శాతం పూర్తయ్యాయి. గేట్ వే ఆఫ్ అమరావతిగా బందరు పోర్టు మారేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇన్లాండ్ వాటర్ వేస్ అభివృద్ధి చేయడం ద్వారా అమరావతి నిర్మాణంలో కూడా పోర్టు కూడా భాగస్వామిగా మారబోతోంది. పోర్టు పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీలు కూడా ఎక్కువగా మచిలీపట్నంలో ఏర్పడేందుకు అవకాశాలు ఉంటాయి. మరోవైపు మచిలీపట్నంలో టూరిజం హబ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. సర్క్యూట్ టూరిజం అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
వచ్చే మార్చికి ఫిషింగ్ హార్బర్ పూర్తి
వచ్చే మార్చికి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పూర్తి చేయాలనే లక్ష్యంతో కాల పరిమితి పొడిగించామని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. మచిలీపట్నం ఫిషింగ్ హర్బర్ పనులను మంత్రులు బీసీ జనార్థన్ రెడ్డి, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, మారిటైం బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య, పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఫిషింగ్ హార్బర్ పనులు నిలిచిపోయాయన్నారు. ఫిషింగ్ హార్బర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో దాదాపు రూ. 422 కోట్లతో నిర్మాణం చేపట్టాం. ఇప్పటికే దాదాపు 57 శాతం పనులు పూర్తయ్యాయి.. కానీ కీలకమైన పనుల్లో జాప్యం జరిగింది. 2026, మార్చి నాటికి ఫిషింగ్ హార్బర్‌ను పూర్తి చేయాలనే లక్ష్యంతో 2 వ సారి కాల పరిమితి పొడిగించాం. దాదాపు రూ. 3500 కోట్లతో రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేస్తున్నాం. ఫిషింగ్ హార్బర్ పూర్తయిన తర్వాత మచిలీపట్నం ప్రాంతాన్ని టూరిజం హాబ్ తీర్చిదిద్దేందుకు మంత్రి కొల్లు రవీంద్ర కృషి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాతే ఫిషింగ్ హర్బర్ పనులు వేగంగా ముందుకు కదులుతున్నాయి. పోర్టులు, ఫిషింగ్ హార్బర్‌ల పురోగతిపై ప్రతీ నెలా సమీక్షిస్తున్నాం. స్థానిక మంత్రి, కలెక్టర్ ఆధ్వర్యంలో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం.వచ్చే ఏడాది మార్చి నాటికి ఫిషింగ్ హార్బర్ ను పూర్తి చేసి, ప్రజలకు అంకితం చేస్తాం. సీ మౌత్ సమస్యపై టెక్నికల్ అంశాలపై అధ్యయనానికి బృందాన్ని చెన్నైకి పంపించాం. ఆ నివేదిక 45 రోజుల్లో వస్తోంది. తర్వాత సీ మౌత్ ను కూడా పూర్తి చేస్తామని మంత్రి జనార్ధన్‌రెడ్డి తెలిపారు.