- దేశంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ యార్డ్‌ను అభివృద్ధి చేస్తున్న సాగర్ డిఫెన్స్
- మొదటి దశలో రూ.45 కోట్ల పెట్టుబడి, వెయ్యిమందికిపైగా ఉద్యోగాల కల్పన
కావలి (చైతన్య రథం): దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడంతోపాటు దేశ సముద్ర సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో కీలకమైన ముందడుగు పడింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద దేశంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్‌యార్డ్, సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అటానమస్ మారిటైం షిప్ యార్డ్, సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్‌ను అభివృద్ధి చేయనుంది. ముందుగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్న మంత్రి లోకేష్‌కు సంస్థ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.
ప్రాజెక్ట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అటానమస్ మారిటైం షిప్ బిల్డింగ్, సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు సాగర్ డిఫెన్స్ సంస్థ మొదటి దశలో రూ.45 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా వెయ్యి మందికి పైగా ఉద్యోగాల కల్పన జరగనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం జువ్వలదిన్నె పిషింగ్ హార్బర్‌వద్ద మొదటి దశ కింద 29.58 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం లీజు ప్రాతిపదికన కేటాయించింది. ఇందులో 7.58 ఎకరాల వాటర్ ఫ్రంట్ ల్యాండ్ కూడా ఉంది. 2026 నవంబర్ నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం 200 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారు. షిప్ బిల్డింగ్, అటానమస్ సిస్టమ్స్ డెవలప్మెంట్, మెరైన్ ఇంజనీరింగ్, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్ట్ బ్లూ ఎకానమీ, మారిటైం ఇన్నోవేషన్‌ను బలోపేతం చేయడంతోపాటు ఏపీని మారిటైం రోబోటిక్స్, అటానమస్ షిప్ బిల్డింగ్ హబ్‌గా నిలపనుంది.
అంతకుముందు నెల్లూరు జిల్లాకు చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు బోగోలు మండలం కప్పరాలతిప్ప వద్ద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రశాంతిరెడ్డి, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పులివర్తి నాని, బొజ్జల సుధీర్‌రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, పి.సునీల్ కుమార్, ఎన్.విజయశ్రీ, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర యాదవ్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బల్లి కల్యాణ చక్రవర్తి, సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్, సీఈవో కెప్టెన్ నికుంజ్ పరాశర్, సీహెచ్ ఆర్వో సన్యుక్తా సింగ్, ఆర్కేపీ సింగ్ తదితరులు పాల్గొన్నారు.














