తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం రాప్తాడు నియోజకవర్గం బసినేపల్లిలో ఎన్టీఆర్ గృహాలను పరిశీలించారు. బసినేపల్లిలో టిడిపి ప్రభుత్వ హయాంలో పేదలకు 120 ఇళ్లు కేటాయించిందన్నారు. ఇంటి స్థలం, ఇళ్ళ నిర్మాణం, రోడ్లు, త్రాగునీరు సదుపాయం, మౌలిక వసతుల కల్పన 90 శాతం టిడిపి హయంలోనే పూర్తయినా మిగిలిన పనులు పూర్తి చేసి ఇళ్ళు కేటాయించకుండా స్థానిక ఎమ్మెల్యే పేదలను వేధిస్తున్నాడని ఆరోపించారు.
టిడిపి హయాంలో పూర్తయిన ఇళ్లు కేటాయించకుండా ఎమ్మెల్యే వేధిస్తున్నారు అంటూ ఎన్టీఆర్ గృహాల లబ్దిదారులు లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గుడి, బడి కోసం కేటాయించిన 1.25 ఎకరాలను తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆక్రమించుకుని పెట్రోల్ బంక్ పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితులు తెలిపారు.అడ్డుకున్న వారి పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. లబ్ధిదారులంతా బీసీలు కావడంతో గృహప్రవేశాలను సైతం ఎమ్మెల్యే అడ్డుకున్నాడని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి అధికారంలోకి రాగానే దగ్గరుండి గృహ ప్రవేశాలు చేయిస్తానని లోకేష్ హామీఇచ్చారు.