సింధనూరు (చైతన్య రథం): కర్ణాటక రాయచూర్ జిల్లా సింధనూరులోని హోసళ్లీ క్యాంప్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవ వేడుకలో విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు మంత్రి హెచ్.డీ కుమారస్వామి, కేంద్ర రక్షణ సహాయమంత్రి సంజయ్ సేథ్‌తో కలిసి శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్‌ను ప్రారంభించారు. ముందుగా స్కూల్ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు, స్థానిక తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో బసవేశ్వర స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ హాస్టల్ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి మంత్రి లోకేష్ ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సైనిక్ స్కూల్ తరగతి గదులను, సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన దివంగత డాక్టర్ దండమూడి రాధాకృష్ణ జ్ఞాపకార్థం పాఠశాల ప్రాంగణంలో నిర్మించిన డా.రాధాకృష్ణ కళాధామ పేరిట ఓపెన్ ఆడిటోరియంను వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర ఉక్కు మంత్రి హెచ్.డీ కుమారస్వామి, కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్‌తోపాటు విశాఖ ఎంపీ శ్రీభరత్, కర్ణాటక వైద్య విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్, కర్ణాటక కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ ఎస్ తంగడగి, కర్ణాటక చిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఎస్ బోసురాజు, సింధనూరు ఎమ్మెల్యే హంపనగౌడ బాదర్లీ, శ్రీకృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ బి వెంకటరావు, డైరెక్టర్లతోపాటు వివిధ పార్టీల నాయకులు, సింధనూరు స్థానిక తెలుగు ప్రజానీకం పెద్దఎత్తున పాల్గొన్నారు.
















