- పూర్వీకుల ఆస్తిని వైసీపీ హయాంలో కబ్జా చేశారని, న్యాయం చేయాలని ఎక్స్ ద్వారా విజ్ఞప్తి
- తక్షణమే స్పందించి భూసమస్యను పరిష్కరించాలని మంత్రి ఆదేశం
- ఏపీ అందరిదీ.. కుల, మత వివక్షకు ఇక్కడ తావులేదని ఉద్ఘాటన
అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా నిర్భయంగా జీవించవచ్చని, ఇక్కడ కుల, మత వివక్షకు తావులేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో తమ పూర్వీకుల భూమిని వైసీపీ హయాంలో కొందరు అన్యాయంగా ఆక్రమించారని, విచారించి న్యాయం చేయాలంటూ ఎక్స్ ద్వారా సిక్కు కుటుంబానికి చెందిన హర్జీవ్ సింగ్ చేసిన విజ్ఞప్తికి మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించారు. 1950లో మా తండ్రి సర్దార్ చరణ్ సింగ్ శ్రీకాకుళం వలసవచ్చారు. ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నాం. శ్రీకాకుళంలోని ఏకైక సిక్కు కుటుంబం మాది. సిక్కు కమ్యూనిటీ అభివృద్ధి కోసం కంచిలిలోని జేఎమ్‌జే క్వానెంట్ స్కూల్‌కు 3.50 ఎకరాలు దానం చేశాం. అయితే కంచిలి, బిరుస్వాడ, లక్ష్మీపురంలోని మా పూర్వీకులకు చెందిన భూములను వైసీపీ అండతో కొందరు వ్యక్తులు కబ్జా చేశారు.
నకిలీ పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మా వద్ద భూములకు సంబంధించిన అన్ని ఆధారాలు, వాస్తవ దస్తావేజులు ఉన్నాయి. కంచిలిలోని భూమి విలువు ప్రస్తుతం రూ.12 కోట్లు. ఆక్రమణలకు గురైన మా భూములను కాపాడాలని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదు. మైనార్టీలమైన తమకు అండగా నిలిచి, తమ భూసమస్యను పరిష్కరించాలని ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్‌కు హర్జీవ్ సింగ్ విజ్ఞప్త్తి చేశారు. హర్జీవ్ సింగ్ విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన మంత్రి లోకేష్.. చర్యలు తీసుకుని సమస్యను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏపీ అందరిదీ.. కుల, మత వివక్షకు భయపడకుండా అర్హులైన ప్రతిఒక్కరు ఇక్కడ జీవించవచ్చన్నారు. మీ ఆస్తిని మీరు అనుభవించడానికి.. సురక్షితమైన, చట్టబద్ధమైన వాతావరణంలో జీవితం గడపడానికి మీకు హక్కు ఉందని లోకేష్ తెలిపారు. మంత్రి స్పందన పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు.