- ఆర్థిక, రాజకీయ, సామాజిక పటుత్వం అవసరం
- స్వయంప్రతిపత్తి, స్వావలంబనతో ముందుకు సాగాలి
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో సమూల మార్పులు
- రాజకీయాలకు అతీతంగా పంచాయతీలకు నేరుగా నిధులు
- ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం, స్థూపం నిర్మించేలా ప్రణాళిక
- జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్
అమరావతి (చైతన్యరథం): గ్రామ పంచాయతీలు బలంగా ఎదిగి అన్ని రంగాల్లో స్వయం ప్రతిపత్తిని సాధించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అన్న మహాత్ముడి మాటకు అనుగుణంగా పల్లెలు జాతీయ సమగ్రతకు, సుస్థిరతకు కూడా మూల కేంద్రాలు కావాన్నారు. స్థానిక సంస్థలు అన్ని రంగాల్లో స్వావలంబన సాధించి స్థానిక ప్రభుత్వాలుగా మారేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకు పల్లెలు అంటే ప్రాణం. పల్లెల్లో బతకాలని బలంగా ఉండేది.. కానీ సాధ్యపడలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో చాలా ఇష్టంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను చేపట్టాను. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఏ పనికి ఏ నిధుల కేటాయింపు జరిగిందో అది పక్కాగా దానికే ఖర్చు చేయాలని అధికారులకు చెప్పాను. పారదర్శకంగా పనులు జరగాలని కూడా చెప్పాను. ఎలాంటి మళ్లింపులు, వృథా ఖర్చులు లేకుండా పల్లెల్లో సౌకర్యాలు, వసతులు సమకూరాలని చెప్పాను. దాని ప్రకారమే ఇప్పుడు పనులు జరుగుతున్నాయని పవన్ తెలిపారు.
నిబంధనల మేరకు పారదర్శకంగా బదిలీలు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లోని సిబ్బంది బదిలీలు ఎన్నడూ జరగనంత పారదర్శకంగా జరిపాం. సిఫార్సులకు, అవినీతికి తావు లేకుండా బదిలీలను పక్కాగా జరిపాం. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులు ఉన్నప్పటికీ నిబంధనలను అనుసరించి మాత్రమే బదిలీలు చేశాం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో సమూల మార్పులు తీసుకొచ్చాం. దీని ఫలితమే నేడు పల్లెల్లో సమష్టి కృషితో పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటిని ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో కృషి చేస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రశిభూషణ్ కుమార్‌కి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పనులను వేగవంతంగా పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులు కూడా త్వరలోనే అందుతాయి. కేంద్రంలో కొన్ని ఆర్థికపరమైన అంశాల వల్ల ఆలస్యం అయింది. అవి త్వరలోనే తీరుతాయి. పాలనపరమైన అనుభవం లేకున్నా, ప్రజలకు మేలు చేయాలనే త్రికరణ శుద్ధి ఉందని పవన్ స్పష్టం చేశారు.
రాజకీయాలకు అతీతంగా నిధులు
గ్రామ పంచాయతీలు గతంలో కులాలు, రాజకీయాలు, వర్గపోరుతో సతమతం అయ్యేవి. దీన్ని క్రమంగా అధిగమిస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా గ్రామ పంచాయతీలకు నిధులు అందిస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామ సర్పంచుల ఆత్మగౌరవం నిలిపేలా జాతీయ పండుగల నిధులను పెంచాం. స్థానిక సంస్థల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు తగిన గౌరవం ఇస్తున్నాం. దాన్ని కొనసాగిసామని పవన్ భరోసా ఇచ్చారు.
గత ప్రభుత్వం పంచాయతీలను నిర్లక్ష్యం చేసింది
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ఇంత ఘనంగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం జరగలేదు. అసలు ఇలాంటి దినోత్సవం ఉందని కూడా చాలామంది మర్చిపోయారు. పంచాయతీల నిధులను గత ప్రభుత్వం ఇష్టానికి వాడేసింది. గ్రామాభివృద్ధిని నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వ వచ్చిన వెంటనే ఆర్థిక సంఘం పెండిరగ్ నిధులు, రావాల్సిన నిధులను డైరెక్టుగా పంచాయతీల ఖాతాల్లో వేశాం. రూ.1,121 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను అందించడం గొప్ప విషయం. ఆర్థికంగా పంచాయతీలను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించి ముందుకు సాగేలా ప్రణాళిక రచిస్తున్నామని పవన్ తెలిపారు.
ఉపాధి కూలీ అనొద్దు..
ఉపాధి హామీ పథకంలో పని చేసే వారిని కూలీలు అని పిలవడం కాస్త ఇబ్బందిగా ఉంది. గ్రామాల అభివృద్ధిలో చోదకులుగా పని చేస్తున్న వారిని అలా పిలవడం అంత బాగా లేదు. ఇక నుంచి ఉపాధి శ్రామికులు లేదా నేస్తాలుగా వారిని పిలుద్దాం. దీన్ని రాష్ట్రంలోని అధికారులకు తెలియజేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం 9 నెలల్లోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో రూ.10,669 కోట్ల పనులు జరిగాయి. 13,326 గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాలను చక్కగా అమలు చేశాం. 4 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 21,564 గోకులాలు, 12,950 నీటి తొట్టెలు, 20,286 ఫాం పాండ్స్‌ను అతి తక్కువ కాలంలో పూర్తి చేయడం మనందరి సమష్టి కృషికి నిదర్శనం. దీంతోపాటు పంచాయతీరాజ్ వ్యవస్థను గిరిజన గ్రామాల్లోనూ విస్తరించడం ఓ గొప్ప ముందడుగు. అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా రూ.1,005 కోట్లతో 1069 కిలోమీటర్ల మేర రోడ్లను వేసి, డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి ముందడుగు వేస్తున్నాం. గిరిజన గ్రామాల్లో సమర్థవంతంగా సంస్కరణలు అమలు చేస్తున్నామని పవన్ తెలిపారు.
కలప పెంచుదాం.. దేశానికి సేవ చేద్దాం
భారతదేశం ఏటా రూ.20 వేల కోట్ల కలపను దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం ఖర్చు అవుతోంది. పంచాయతీల్లో కలపను పెంచేలా ఓ ప్రణాళికను అమలు చేయనున్నాం. దేశ అవసరాల కోసం కలపను దేశీయంగానే అందించే ఏర్పాటు చేస్తే ఇటు పంచాయతీలకు ఆర్థిక వృద్ధితోపాటు విదేశీ మారకద్రవ్యం ఖర్చు చేయకుండా కాపాడి దేశసేవ చేసిన వాళ్లమవుతాం. దీనికి సంబంధించి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు త్వరలోనే మార్గదర్శకాలు అందుతాయి. పంచాయతీల్లో విలువైన ఖాళీ స్థలాల్లో కలపను పెంచేందుకు ప్రొత్సహిస్తాం. దీనివల్ల పంచాయతీలకు పచ్చదనంతో పాటు ఆదాయం కూడా సమకూరుతుంది. భారతదేశాన్ని దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే దేశంగా మార్చడమే లక్ష్యం. పంచాయతీలకు గతంలో ఆదాయం ఆధారంగా గ్రేడిరగ్ ఇచ్చేవారు. దాన్ని తొలగించి జనాభా ఆధారంగా గ్రేడిరగ్ ఇచ్చే ఏర్పాట్లు చేశాం. పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూళ్లు పెరిగాయి. 9 నెలల్లో రూ.800 కోట్ల ఇంటి పన్నులు వసూలు అయినట్లు లెక్కలు చెబుతున్నాయని పవన్ చెప్నారు.
పంచాయతీల స్థలాలకు ఆడిట్ జరగాలి
పంచాయతీలు స్వాతంత్రంగా, స్వయం ప్రతిపత్తి సాధించాలంటే భవిష్యత్తు అవసరాలకు భూమి అవసరం. నేను ఇటీవల రైల్వే కోడూరు నియోజకవర్గం, మైసూరవారి పల్లెకు వెళ్లినపుడు ఆ గ్రామంలో క్రీడా స్థలం ఏర్పాటు కోసం అసలు పంచాయతీ వద్ద భూమి లేదని చెప్పారు. నాకు ఆశ్చర్యం కలగింది. తర్వాత మైసూరవారి పల్లెకు క్రీడా స్థలం కోసం నా సొంత నిధులతో ప్రయివేటు స్థలం కొనుగోలు చేసి అందించాను. పంచాయతీకి భూమి లేకుంటే భవిష్యత్తు అవసరాలకు, అభివృద్ధిలో ఎలా ముందుకు వెళ్లగలం? దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి భూములపై సమగ్ర ఆడిట్ జరగాలి. ఆస్తులు, భవనాలు, అన్యాక్రాంతం అయిన భూములు అన్నింటిపై సమగ్ర ఆడిట్ చేసేలా ఓ ప్రణాళిక రూపొందించండి. పంచాయతీల భవిష్యత్తు అవసరాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనిలో ఏవైనా రాజకీయ ప్రమేయాలు, సిఫార్సులు ఉంటే నేను చూసుకుంటాను. రాజకీయ అడ్డంకులు కనుక వస్తే తాను అండగా ఉంటానని పవన్ స్పష్టం చేశారు.
గ్రామాల్లో జాతీయ సమగ్రత ప్రాంగణాలు, స్థూపాలు
గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలే కాదు.. జాతి సమగ్రతకు నిండు రూపాలు కావాలి. కాశ్మీర్‌లో పేలిన తూటా దేశాన్ని కన్నీరు పెట్టేలా చేసింది. ప్రతి ఒక్కరూ ఆవేదన చెందారు. ప్రతి గ్రామంలోనూ ఎవరెవరివో విగ్రహాలు పెడుతున్నారు. అలా కాకుండా ప్రతి పంచాయతీలోనూ ఓ జాతీయ సమగ్రత ప్రాంగణం ఉండాలి. దానిలో జాతీయ సమగ్రత స్థూపం ఉండాలి. అది వేయి గజాల్లో పెడతారా.. రెండొందల గజాల్లో పెడతారా అనేది ఉన్నతాధికారులు ఆలోచించాలి. ఈ ప్రాంగణంలో దేశం కోసం, దేశ ఐక్యత కోసం పనిచేసిన వారి ప్రతిరూపాలు ఉండాలి. దీనిపై సమగ్ర ప్రణాళికతో, శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. దీనిపై ఉన్నతాధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తే, నేను కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తా. అవసరం అయితే ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తాను. అలాగే గౌరవ వేతనాలు పెంచాలని సర్పంచులు కోరారు. ఇతర సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. వీటిని పరిష్కరించే ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు.
ఉగ్రదాడి అమరులకు నివాళులు
కార్యక్రమం జాతీయ గీతాలాపనతో ప్రారంభం అయింది. ముందుగా పహల్గాం ఉగ్ర దాడి అమరులైన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ స్వాగతోపన్యాసం చేయగా, ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ తమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలు, లక్ష్యాలను వివరించారు. అనంతరం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన సుమారు 15 విభాగాల్లో వివిధ స్థాయిల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన 74 మందికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు.