అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన వెనుకబడిన వర్గాలకు స్త్రీనిధి ద్వారా పెద్దఎత్తున రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం స్త్రీనిధి విభాగం విస్తరణకు సిద్ధం కావాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం విజయవాడలోని ప్రముఖ హోటల్లో జరిగిన స్త్రీనిధి వర్క్‌షాప్, సిబ్బంది సమీక్ష సమావేశాన్ని మంత్రి ప్రారంభించారు. స్త్రీనిధి సంస్థ ద్వారా పేద ప్రజలకు రాబోయే రోజులలో రుణాల పంపిణీ మొత్తాన్ని పెంచుతామన్నారు. పొదుపు సంఘాలలో నిరుపయోగంగా ఉన్న నిధులను స్త్రీనిధిలో డిపాజిట్ చేసి మహిళలకు పెద్దమొత్తంలో రుణాలను అందించేందుకు వెలుగు 2.0 ముందుకు సాగాలని మంత్రి సూచించారు. సెర్ప్ సీఈవో వాకాటి కరుణ మాట్లాడుతూ స్త్రీనిధి సంస్థకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఆర్ధిక క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ సెర్ప్, స్త్రీనిధి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్త్రీనిధి మేనేజింగ్ డైరక్టర్ జివిబిడి హరిప్రసాద్ స్త్రీనిధి రుణాల పంపిణీ, రికవరీ, నిరర్థక రుణాల వసూలుపై సమీక్షించారు. కార్యక్రమంలో పలువురు డిజియంలు, పదహారు జిల్లాల ఎజియంలు, మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, కేంద్ర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.