- కౌలు పెంచేందుకు సీఎం అంగీకారం
- పురపాలక మంత్రి పొంగూరు నారాయణ
- రెండో విడత భూ సమీకరణ ప్రారంభం
అమరావతి(చైతన్యరథం): రాజధానిలో కొత్తగా ల్యాండ్ పూలింగ్‌కు భూములిచ్చే రైతు కుటుంబాలకు లక్షన్నర వరకూ రుణమాఫీ చేస్తామని మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించా రు. రూ.500 కోట్ల మేర భారం పడుతున్నప్పటికీ సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. దీంతో పాటు భూములిచ్చే రైతులకు ప్రస్తుతం మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కౌలు రేట్లు పెంచేందుకు కూడా సీఎం సూత్ర ప్రాయంగా అంగీకరించారని చెప్పారు. రైతుల తరపున సీఎం చంద్రబాబుకు మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలిపారు. అమరావతి విస్తరణలో భాగంగా కొత్తగా చేపట్టే ప్రాజెక్ట్‌లకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మంత్రి ప్రారంభించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే లైన్, రైల్వే ట్రాక్ కోసం అమరావతి, తుళ్లూరు మండలాల్లోని 7 రెవెన్యూ గ్రామాల్లో మొత్తం 16,666.57 ఎకరాల భూమిని భూసమీకరణ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. బుధవారం ఉదయం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వడ్డమానులో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమా ర్‌తో కలిసి ల్యాండ్ పూలింగ్ కాంపిటెంట్ అథారిటీ కార్యాల యాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మంత్రి ప్రారంభించారు. గ్రామంలోని రైతులతో సమావేశం ఏర్పాటుచేసి వారి వద్ద నుంచి అంగీకార పత్రాలను తీసుకున్నారు మంత్రి.రైతులు మైనేని సత్యనారాయణ 4.01 ఎకరాలు, వడ్లమూడి శ్రీలక్ష్మి 4.22 ఎకరాలు, సాయి తరుణ్ 1.75 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చేందుకు తమ అంగీకారం తెలుపుతూ ఫారం -1ను అందజేశారు. వడ్డమానులో 1768.01 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటామన్నారు
. గతంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన తో పాటు ఇతర కారణాలతో పనులు ప్రారంభం ఆలస్యం అయిం దన్నారు..ఎన్నికలకు కేవలం ఏడాదిననర ముందు మాత్రమే పనులు ప్రారంభం కావడంతో పనులు పూర్తి కాలేదన్నారు. అయి తే గత ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులు పెట్టిందని..కానీ ప్రస్తుతం అమరావతి పనులన్నీ వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాజధానిలో ప్రస్తుతం 55 వేల కోట్ల విలువైన పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. 4026 నివాసాలతో పాటు రోడ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వేగంగా జరుగు తుందని మంత్రి చెప్పారు. మూడేళ్లలోగా నిర్మాణ పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఒకరిద్దరు రైతులు తమ అభిప్రాయాలను వివరించారు. రిటర్నబుల్ ప్లాట్లను త్వరిత గతిన అభివృద్ధి చేయాలని కోరగా దీనికి మంత్రి అంగీకరించారు..రైతులకిచ్చిన ప్లాట్లలో ముందుగా రెండు వరుసల రోడ్లు నిర్మాణం చేస్తామని….దీని ద్వారా రైతులు తమ ప్లాట్ల క్రయవిక్రయాలు చేసుకోవచ్చని చెప్పారు.
400 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకారం
ఇక బుధవారం మధ్యాహ్నం అమరావతి మండలం ఎండ్రాయి లో స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌తో కలిసి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో పాటు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో పాటు పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. గ్రామంలో మొత్తం 1925 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కోసం తీసుకోవలసి ఉండగా మొదటిరోజే సుమారు 400 ఎకరాల భూమిని పూలింగ్ లో ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ ఫారం -1 ను మంత్రి నారాయణకు రైతులు అందజేశారు. ఒకేసారి ఇంత పెద్దఎత్తున భూమి ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడంపై మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలిపారు. ఎండ్రాయిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ నిర్మాణం చేస్తున్నామని..భూములు ఇచ్చిన మూడు నెలల్లోనే మాస్టర్ ప్లాన్ పూర్తి చేసి ఏడాదిలోగా ఎండ్రాయి ప్రాం తంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.















