- నేడు ప్రారంభిస్తోన్న సీఎం చంద్రబాబునాయుడు
రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి సర్కారు కీలక చర్యలు చేపట్టింది. వీటిలో అత్యంత ముఖ్యమైనది `వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం. 2025 ఏప్రిల్ 26నుంచి వేట నిషేధ భృతి కింద ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ. 20,000 ఆర్థిక సాయం అందిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మత్య్సకారులకు అందించినది కేవలం రూ.10,000లు మాత్రమే. ఇప్పుడు దానిని రెట్టింపు చేస్తూ కూటమి ప్రభుత్వం సాయం అందించనుంది. ఈ పథకంతో సుమారు 1.2 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.
మత్య్సకారుల జీవితాలను ఛిద్రం చేసిన జగన్‌రెడ్డి
ఏపీ తీరప్రాంత గ్రామాల్లో, సముద్రం ఒడ్డున, చెరువుల పరిసరాల్లో జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలు ఒకప్పుడు స్వావలంబన, గౌరవంతో నిండి ఉండేవి. 2019లో వైసీపీ అధికారంలోకి రావడమే `మత్స్యకారులకు కష్టాలు మొదలయ్యాయి. వైసీపీ తీసుకొచ్చిన జీవో 217తో మత్స్యకారుల జీవనాధారపై బలమైన వేటుపడిరది.
టీడీపీ హయాంలో స్వర్ణయుగం
2014-2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం మత్స్యకారుల జీవితాలను సమున్నతరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, రిజర్వాయర్లు మత్స్యకార సొసైటీలకు అప్పగించారు. ఆక్వా అభివృద్ధిలో భాగంగా పభుత్వం ఉచితంగా చేప పిల్లలను అందించింది, వలలు, పడవలు, ఐస్‌బాక్సులు, ఆటోలు, డీజిల్ సబ్సిడీలతో (లీటరుకు రూ.6 వరకు) మత్స్యకారులను వ్యాపారులుగా ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది. వేట నిషేధ సమయంలో (ఏప్రిల్ 14 నుండి జూన్ 14 వరకు) రూ.4,500 నగదు, 25 కిలోల బియ్యం, పప్పులు, చింతపండు వంటి నిత్యావసర సరుకులు వారి ఇళ్లకు చేరాయి. చంద్రన్న బీమా ద్వారా మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం, వారి పిల్లల కోసం ఆరు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. బడ్జెట్ కేటాయింపులు 2017-18లో రూ.188 కోట్ల నుండి 2018-19లో రూ.339 కోట్లకు పెరిగాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ మత్స్య ఎగుమతుల్లో దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. సముద్ర ఉత్పత్తుల విలువ రూ.30,000 కోట్ల నుండి రూ.70,000 కోట్లకు చేరింది.
జీవో నెం.217: మత్స్యకారుల జీవనాధారంపై దాడి
2019లో వైసీపీ అధికారంలోకి రాగానే, మత్స్యకారుల జీవితాల్లో చీకటి కమ్ముకుంది. జగన్‌రెడ్డి ప్రభుత్వం జీవో నెం.217ని ప్రవేశపెట్టింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా వేలాది చెరువులు, రిజర్వాయర్లు, సాగునీటి కాలువలను ఆన్‌లైన్ వేలంలో దళారీలకు, వైసీపీ నాయకులతో సంబంధాలున్న వ్యక్తులకు అప్పజెప్పింది. ఒకప్పుడు సొంతంగా చేపలు పట్టి, వ్యాపారం చేసిన మత్స్యకారులు ఇప్పుడు ఈ కొత్త లీజుదారుల కింద కూలీలుగా మారారు. వారి సాంప్రదాయ కుల వృత్తి నిర్వీర్యమైంది. గ్రామాల్లో జీవనం కష్టతరమై, చాలామంది వేట నిషేధ సమయంలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లవలసి వచ్చింది. ఈ దుస్థితి మత్స్యకారుల కుటుంబాలను పేదరికంలోకి నెట్టివేసింది.
వైసీపీ సంక్షేమం కేవలం హడావుడి మాత్రమే
వైసీపీ ప్రభుత్వం ‘‘మత్స్యకార భరోసా’’ పథకం ద్వారా మత్స్యకారులకు సాయం చేస్తున్నామని గొప్పలు చెప్పింది. కానీ, ఈ పథకాన్ని నీరుగార్చారు జగన్‌రెడ్డి. 2 లక్షల మంది మత్స్యకారులు ఈ వృత్తిపై ఆధారపడినప్పటికీ, కేవలం 1,09,231 మందికి మాత్రమే ఈ సాయం అందింది. రూ.10,000 నగదు సాయం ప్రకటించినప్పటికీ, టీడీపీ హయాంలో అందిన నిత్యావసర సరుకుల పంపిణీని నిలిపివేశారు. రైతు భరోసా, వాహన మిత్ర వంటి ఇతర పథకాల లబ్ధిదారులకు నిషేధ సమయంలో సాయం ఇవ్వకుండా చేసిన జీవో నెం.30 మత్స్యకారుల సంఖ్యను మరింత కుదించింది. చంద్రన్న బీమా పథకాన్ని రద్దు చేసి, రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. హుధూద్ తుపాను సమయంలో టీడీపీ ఉచిత పడవలు, వలలు, రూ.17.06 కోట్ల పరిహారం అందించగా, వైసీపీ హయాంలో తుపాన్లు, వరదల వల్ల నష్టపోయిన మత్స్యకారులకు ఎలాంటి సాయం అందలేదు. ఈ వైఫల్యాలతో ఆంధ్రప్రదేశ్ మత్స్య ఎగుమతుల్లో అగ్రస్థానాన్ని కోల్పోయింది, మణిపూర్‌వంటి రాష్ట్రాలు రాష్ట్ర ఉత్పత్తులను నిషేధించాయి.
కూటమి ప్రభుత్వంతో కొత్త వెలుగులు
2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో మళ్లీ వెలుగు నింపే ప్రయత్నం ఆరంభించింది. జీవో నెం.217ని రద్దుచేసి, మత్స్యకారుల జీవనోపాధిని పునరుద్ధరించేందుకు రూ.540.19 కోట్లు కేటాయించింది. వేట నిషేధ సమయంలో అందించే ఆర్థిక సాయాన్ని రూ.10,000 నుండి రూ.20,000కి రెట్టింపు చేసింది. 2025 ఏప్రిల్ 26 నుండి 1,22,968 మత్స్యకార కుటుంబాలకు ఈ సాయం అందనుంది. మత్స్యకార సంక్షేమం కోసం రూ.246 కోట్ల బడ్జెట్ కేటాయించి, రూ.245.93 కోట్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పంపిణీ చేయనుంది. ఈ చర్యలు మత్స్యకారుల్లో నూతన ఆశలను రేకెత్తిస్తున్నాయి. సముద్ర తీరంలో మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని వారు
నమ్ముతున్నారు.
`తోట నిర్మలాజ్యోతి, అనలిస్ట్