అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలకపాత్రధారిగా భావిస్తున్న నాటి ప్రభుత్వ సలహాదారు, జగన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు కసిరెడ్డి రాజశేఖరరెడ్డికి హై కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణంలో విచారణకు రావాలంటూ సీఐడీ జారీ చేసిన నోటీసులను కొట్టి వేయాలంటూ కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది. గురువారం ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.
జగన్‌తో తనకున్న సంబంధాలతో వైసీపీ అధికారంలోకి రాగానే కసిరెడ్డి ప్రభుత్వ సలహాదారు పదవిని పొందారు. ప్రభుత్వ సలహాదారు పదవి ద్వారా చేయాల్సిన పనిని పక్కనపెట్టేసిన కసిరెడ్డి మొత్తం మద్యం కుంభకోణానికి పథకరచన చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ఆయన ఏకంగా ఓ ప్రత్యేక నెట్ వర్క్ నే ఏర్పాటు చేసి ఐదేళ్ల పాటు దానిని పకడ్బందీగా నిర్వహించారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధికారం దిగిపోగానే మద్యం కుంభకోణం వెలుగు చూసింది. కసిరెడ్డి ప్లాన్ వేస్తే ఆయన వెనకుండి వైసీపీ కీలక నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తతంగాన్ని నడిపించారట. ఈ విషయాలను అటు సీఐడీ అధికారులతో పాటు ఇటీవల సీఐడీ విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా బయటపెట్టారు. మద్యం కుంభకోణం మొత్తం కసిరెడ్డి చేతుల మీదుగానే జరిగిందని సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలంటూ సీఐడీ అదికారులు కసిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను కసిరెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. తనకు సీఐడీ అధికారులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. కసిరెడ్డి వాదనను తోసిపుచ్చింది. అంతేకాకుండా సీఐడీ అదికారులకు సహకరించాలని, విచారణకు హాజరు కావాలని ఆయనకు సూచిస్తూ కసిరెడ్డి పిటిషన్‌ను కొట్టేసింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని కూడా హైకోర్టు కసిరెడ్డికి తేల్చి చెప్పింది.