- ముందస్తు బెయిల్‌కు నిరాకరణ
- ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప అరెస్ట్ నుంచి రక్షణకూ నో
న్యూఢిల్లీ (చైతన్యరథం): ఏపీ మద్యం కుంభకోణం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. కాగా.. ఈ కేసు మొదలైనప్పుడే ఈ ముగ్గురు కూడా ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టుకు వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండిరగ్‌లో ఉన్నందున.. అక్కడ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత తమ దగ్గరకు రావాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో బుధవారం ఈ ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. దాంతో గురువారం సుప్రీం కోర్టు ముందుకు వచ్చిన ముగ్గురు నిందితులు.. హైకోర్టు నిరాకరించినందుకు తమకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ ముగ్గురికి మధ్యంతర రక్షణ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.
వాదనల సందర్భంగా.. హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడే నిందితులు సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ తెలిపారు. ఆ పిటిషన్ ఇప్పుడు విచారణార్హం కాదని పేర్కొన్నారు. హైకోర్టు తాజాగా ముందస్తు బెయిల్ నిరాకరించినందున నింధితులు గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను సవరించాలని.. లేదా కొత్త పిటిషన్‌ను దాఖలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలో కొత్తగా మరోసారి పిటిషన్ దాఖలు చేయడానికి అనుమతివ్వాలని ధర్మాసనాన్ని నిందితులు కోరగా.. జస్టిస్ పార్టీవాలా ధర్మాసనం అనుమతించింది.
మరోవైపు ఈ నెల 13వ తేదీ వరకైనా మధ్యంతర రక్షణ కల్పించాలని నిందితుల తరపు న్యాయవాదులు అభ్యర్థించారు. మధ్యంతర రక్షణ ఇవ్వడం కుదరదని ధర్మాసనం తేల్చిచెప్పింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించడంతో ఈ ముగ్గురి కోసం సిట్ బృందం వేట మొదలుపెట్టింది. విజయవాడ, హైదరాబాద్‌లలో వీరి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. కానీ ఈ ముగ్గురు తమ సెల్‌ఫోన్లను స్విచ్‌ఆఫ్ చేసి పెట్టుకున్నట్లు సిట్ గుర్తించింది.
వైసీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో నాటి సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, నాటి సీఎం జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను ఇటీవల సిట్ నిందితులుగా చేర్చింది. ఇప్పటివరకూ 30 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ముడుపుల వసూళ్లకు వీలుగా మద్యం విధానాన్ని సిద్ధం చేయాలనే కుట్రకు రూపకల్పన, ముడుపుల వసూళ్ల నెట్‌వర్క్ నిర్వహణలో అప్పటి ప్రభుత్వ పెద్దల తరపున కీలక పాత్ర పోషించిన ప్రధాన నిందితుడు(ఏ1) రాజ్ కసిరెడ్డి, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆ పార్టీ మాజీ నేత వీ విజయసాయిరెడ్డి, తదితరులతో కలిసి ఈ ముగ్గురూ కుంభకోణంలో అన్ని స్థాయిల్లోనూ భాగస్వాములయ్యారని, మద్యం స్కాంలో వీరిదీ ప్రధాన పాత్రేనని సిట్ ఇప్పటికే నిర్ధారించింది.