– మహిళల స్వయం ఉపాధికి నారా లోకేష్ ఆలోచన నుంచి పుట్టిన పథకం
– ఇప్పటివరకూ 3508 మంది మహిళలకు శిక్షణ
– నారా లోకేష్ సొంత నిధులతో ఉచితంగా 3508 కుట్టు మిషన్లు పంపిణీ
– అద్భుత పథకం అంటున్న లబ్ధిదారులు
అమరావతి (చైతన్యరథం): సహజంగా ఊళ్లలో పాత ఇళ్లలో ఏ గుమ్మం చూసినా పసుపు రంగులో కనిపిస్తుంది. శుభానికి సంకేతం అయిన పసుపు కొందరు పూస్తే, మరికొందరు పసుపు రంగు పెయింట్ చేస్తారు. మంగళగిరి నియోజకవర్గంలోని వేలాది ఇళ్లలో స్వయం ఉపాధి శుభ సంకేతం పసుపు రంగులో కుట్టు మిషన్లు మనకు దర్శనమిస్తాయి. ఇవన్నీ 2022 నుంచి నేటివరకూ యువనేత నారా లోకేష్ తన సొంత నిధులతో మహిళామణుల స్వయం ఉపాధి కోసం ఉచితంగా అందించినవే..
మంగళగిరి నియోజకవర్గం నుంచి 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అపజయం పాలైనా, తనను ఇంతగా ఆదరించిన ప్రజల మంచిచెడ్డలు చూడటం తన బాధ్యతగా భావించారు. తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే వారికి చేయూతనందించేందుకు వివిధవర్గాల సంక్షేమానికి ఏడు పథకాలు రూపొందించి, పకడ్బందీగా అమలు చేశారు. చేనేతలు, స్వర్ణకారులు, మహిళలు, చిరువ్యాపారుల స్వయం ఉపాధికి తన సొంతనిధులతో పరికరాలు, సామాగ్రి, పెట్టుబడిగా అందజేశారు.
తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారతకు చేసిన కృషిని తన తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబు నుంచి వారసత్వంగా స్వీకరించారు నారా లోకేష్. తల్లి భువనేశ్వరి ఆశీస్సులు, భార్య బ్రాహ్మణి ప్రోత్సాహంతో స్త్రీశక్తి పథకానికి రూపకల్పన చేశారు.
మంగళగిరి నియోజకవర్గంలో కుల,మతాలకు అతీతంగా ఆసక్తి గల మహిళలకు ఉచితంగా బ్యూటీషియన్ కోర్సు, టైలరింగ్ శిక్షణకు ఉద్దేశించిన స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు.
మంగళగిరి నియోజకవర్గ కేంద్రంలో తొలి స్త్రీ శక్తి కేంద్రం 2022, జూన్20 ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఇప్పటివరకూ 43 బ్యాచుల్లో 2226 మందికి నిపుణులైన వారితో శిక్షణ ఇప్పించారు. శిక్షణాకాలంలో దారం-సూది కూడా మహిళలు తీసుకురావాల్సిన అవసరం లేకుండా, కేంద్రం నుంచే ఉచితంగా సరఫరా చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న 2226 మందికి సర్టిఫికెట్లు అందజేసి, కుట్టుమిషన్లు ఉచితంగా అందజేశారు.
ఆసక్తి గల మహిళలు అధిక సంఖ్యలో వస్తుండడంతో నియోజకవర్గంలో ఇతర మండలాలోనూ స్త్రీశక్తి కేంద్రాలు నెలకొల్పారు. తాడేపల్లిలో స్త్రీ శక్తి కేంద్రం 2023, ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. ఇక్కడ 17 బ్యాచుల్లో శిక్షణ తీసుకున్న 666 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. దుగ్గిరాలలో 2023 ఏప్రిల్ 10న ఆరంభించిన స్త్రీశక్తి కేంద్రంలో 16 బ్యాచుల్లో 616 మంది ట్రైనింగ్ పూర్తి చేసుకోగా, వీరందరికీ మిషన్లు అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో ఇప్పటివరకూ 3508 మందికి శిక్షణ పూర్తిచేసుకోగా, ఉచితంగా నాణ్యమైన కుట్టు మిషన్లు అందజేశారు. వీరంతా ఇప్పుడు టైలరింగ్ షాపులు, ఇళ్లల్లోనూ టైలరింగ్ ద్వారా ఉపాధి పొందుతున్నారు.
మూడేళ్లుగా విజయవంతంగా నడుస్తున్న స్త్రీ శక్తి పథకానికి ఖర్చు అయిన ప్రతీ రూపాయి నారా లోకేష్ తన సొంత నిధుల నుంచే వెచ్చిస్తున్నారు.