- వచ్చే 15 నుంచి రాజధాని నిర్మాణపనులు ప్రారంభం
- ప్రాధాన్య ప్రాజెక్ట్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
- ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక టెండర్లు ఖరారు
- తరువాత ఊపందుకోనున్న పనులు
అమరావతి (చైతన్యరథం): జగన్‌రెడ్డి విధ్వంస పాలన కారణంగా ఐదేళ్లపాటు నిలిచిపోయిన రాజధాని అమరావతి పనులు మార్చి 15 నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా నిర్మించాల్సిన అమరావతిని జగన్ రెడ్డి పాడుబెట్టేశారు. ఒకవేళ తాను అధికారం కోల్పోయి, మరొకరు అధికారంలోకి వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నిర్మించటానికి వీలు లేకుండా చేయాల్సిన విధ్వంసమంతా చేశారు. అయితే అమరావతికి పునాది వేసిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే మొదట అమరావతిపైనే దృష్టి సారించారు. రాష్ట్ర విభజన కారణంగా 2014లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలో చిల్లి గవ్వ లేదు. జగన్ చేసిన అప్పుల కారణంగా ఇప్పుడూ ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వ లేదు. అంటే అప్పుడూ, ఇప్పుడూ ఒకే పరిస్థితి నెలకొని ఉంది. కానీ సీఎం చంద్రబాబు.. మొక్కవోని పట్టుదలతో ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.15000 కోట్లు, హడ్కో నుంచి మరో రూ.11,000 కోట్లు దీర్ఘకాలిక రుణాలు సాధించి అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. చేతిలో నిధులు, రాజధాని నిర్మించుకోవాలనే బలమైన సంకల్పం, కేంద్రం సహాయ, సహకారాలు ఉన్నందున ఒకసారి పనులు ప్రారంభమయితే పరుగులు తీయటం ఖాయమే.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్ల ఖరారు ఆలస్యం అయ్యింది. టెండర్లు పిలుచుకోవచ్చు కానీ ఖరారు చేయవద్దని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు దాదాపు 62 పనులకు సీఆర్డీఎ, ఏడిసీ టెండర్లను పిలిచాయి. సుమారు 40 వేల కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. మరో 11 పనులకు త్వరలో టెండర్లు పిలువనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తేయగానే టెండర్లు ఖరారు చేస్తారు. మార్చి 15 నుంచి నిర్మాణ సంస్థలు తమ యంత్రాలు, కార్మికులు, ఇంజనీర్లను అమరావతిలో దించబోతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంకల్లా అమరావతిలో వివిధ సంస్థలకు చెందిన 30,000 మంది ఇంజనీర్లు, సూపర్‌వైజర్లు, కార్మికులు పనులు చేస్తుంటారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ తెలిపారు. 2027 డిసెంబర్‌లోగా అమరావతిలో వీలైనన్ని నిర్మాణ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామని, వాటితో రాజధానికి రూపురేఖలు వస్తాయని మంత్రి నారాయణ చెప్పారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రాధాన్య ప్రాజెక్టుగా తీసుకుంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ స్వయంగా అమరావతి ప్రాంతంలో పర్యటించి అక్కడ నిలిచిపోయిన పనులను పరిశీలించారు. తరువాత చెన్నై ఐఐటీ, హైదరాబాద్ ఐఐటీలకు చెందిన నిపుణుల బృందం అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలను పరిశీలించి, సెక్రటేరియెట్, అసెంబ్లీ వంటి ఐకానిక్ భవనాల పటిష్టతపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారు. ఇక్కడ నిర్మాణాలకు ఎలాంటి డోకా లేదంటూ ఐఐటీ బృందం నివేదిక ఇచ్చింది. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ భవనాలు పటిష్టంగా ఉన్నాయని నివేదిక ఇచ్చారు. అలాగే అమరావతిలో పేరుకుపోయిన జంగిల్ క్లియరెన్స్‌ను పూర్తిస్థాయిలో చేపట్టారు. దీంతో నిర్మాణాలకు ఎలాంటి ఆటంకం లేకుండా శరవేగంగా పనులు ముందుకు సాగుతాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఇప్పుడు రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉంది. కేంద్రంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నారు. ఏపీకి కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోంది. ముఖ్యంగా అమరావతిని వ్యతిరేకస్తున్న జగన్, కేసీఆర్ ఇద్దరూ రాజకీయంగా చాలా బలహీనంగా ఉన్నారు. కనుక అమరావతి నిర్మాణ పనులకు ఇక ఎటువంటి ఆటంకమూ లేనట్లే!