అమరావతి (చైతన్యరథం): గత ప్రభుత్వం ఆడిన మూడుముక్కలాటతో అమరావతిలో భూములు పొందిన సంస్థలు నిర్మాణాలు ప్రారంభించేందుకు ముందుకు రాలేదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో అమరావతిలో భూములు కేటాయించిన వివిధ సంస్థలతో ఈ విషయమై మరోసారి సంప్రదింపులు జరపాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రాజధానిలో భూకేటాయింపులకు సంబంధించి ఆరుగురు మంత్రులు, అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఉపసంఘం మొదటి సమావేశం సచివాలయంలో శుక్రవారం జరిగింది. మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, టీజీ భరత్ తో పాటు సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న, సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మున్సిపల్ శాఖ కార్యదర్శి కన్నబాబు, ఆర్ధిక శాఖ కార్యదర్శి జే నివాస్, సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ పాల్గొన్నారు.
సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాజధానిలో 2014-19 మధ్య కాలంలో సుమారు 130 సంస్థలకు సీఆర్డీఏ భూకేటాయింపులు చేసిందన్నారు. ఏయే సంస్థలకు ఎక్కడెక్కడ ఎంతెంత భూకేటాయింపులు చేసారనే దానిపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించినట్లు తెలిపారు. గతంలో భూములు కేటాయించిన సంస్థలతో చర్చించాలని సీఆర్డీయే అధికారులను ఆదేశించామన్నారు. గత ప్రభుత్వ మూడుముక్కలాటతో భూములు పొందిన సంస్థలు నిర్మాణానికి ముందుకు రాలేదన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ఆయా సంస్థలకు నమ్మకం వచ్చిందన్నారు. అమరావతికి వచ్చి నిర్మాణాలు ప్రారంభించేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయన్నారు. అలాంటి వాటి విషయంలో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు అమరావతిలో మధ్యలో నిలిచిపోయిన నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల రద్దు పై సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదికను ఈనెల 18న జరిగే కేబినెట్ లో పెట్టి ఆమోదం తీసుకుంటామన్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత కొత్త టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేసారు.
మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ అమరావతిలో ప్రాజెక్ట్‌లు వేగవంతం చేయాలని నిర్ణయించామన్నారు. గతంలో భూములు కేటాయించిన సంస్థలు త్వరగా నిర్మాణాలు ప్రారంభించే లా వారితో సంప్రదింపులు జరుపుతామన్నారు. భూములు కేటాయించిన సంస్థలకు ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాం. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రతి పది రోజులకోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.