- అందరి లక్ష్యం ఇదే కావాలి
- మిషన్ మోడ్‌తో పనిచేసి విజయవంతం చేయాలి
- ఏపీ భవిష్యత్ ఈ పర్యటనపై ఆధారపడి ఉంది
- గతంలో విజయవాడ రోడ్‌షో కంటే మిన్నగా జరగాలి
- పొరపాట్లు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయండి
- అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలోని మంత్రుల బృందం దిశానిర్దేశం
- విశాఖ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం
విశాఖపట్నం (చైతన్యరథం): అందరూ కలిసికట్టుగా మిషన్ మోడ్‌తో పనిచేసి ఈ నెల 8న విశాఖలో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, అధికారులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా ప్రధాని ఏపీ వస్తున్నారని, ఇదొక చరిత్రాత్మక పర్యటన అని పేర్కొన్నారు. అందరూ ఏకైక లక్ష్యంతో పనిచేసి, గతంలో ఎన్నడూ జరగని విధంగా ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఇందుకు అధికారులు, కూటమి నేతలు బాధ్యతలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లకు సంబంధించి విశాఖ కలెక్టరేట్లో ఉన్నతాధికారులు, కూటమి ప్రజాప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల బృందం ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాని పర్యటనకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు మంత్రుల బృందం దిశానిర్దేశం చేసింది.
ప్రధాని పర్యటన రాష్ట్రానికి ఎంతో కీలకం
ప్రధాన మంత్రి పర్యటన రాష్ట్రానికి ఎంతో కీలకం అని, రాష్ట్ర భవిష్యత్ ఈ పర్యటనపై ఆధారపడి ఉందని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మోదీ ఎంతో మద్దతుగా నిలుస్తున్నారని, ఏ రాష్ట్రానికి కేటాయించనంతగా ప్రాజెక్టులను, నిధులను ఏపీకి కేటాయించారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో పరుగులు పెట్టించేందుకు కేంద్ర మద్దతు చాలా అవసరం. అభివృద్ధి వికేంద్రీకరణ ఎన్డీయే నినాదం. ఇదేదో కేవలం ఉత్తరాంధ్రకు సంబంధించిన పర్యటన కాదు.. మొత్తం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్‌కు సంబంధించినది. మనం కూడా సింగిల్ ఎజెండాతో బూత్ స్థాయిలో మానిటరింగ్ చేసి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలి. అందుకు తగ్గట్లుగా ప్రధాని రోడ్ షో, బహిరంగ సభకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి. గతంలో విజయవాడలో జరిగిన ప్రధాని రోడ్ షో కంటే మిన్నగా జరగాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికీ విజయవాడ రోడ్ షో, చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభల గురించి ప్రధాని ప్రస్తావిస్తుంటారని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ గుర్తుచేశారు.
సింగిల్ బారికేడ్లు ఏర్పాటు చేయాలి
ప్రధానమంత్రి రోడ్ షోకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సింగిల్ బారికేడ్లు ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు మంత్రుల బృందం సూచించింది. ఎంతమంది తరలివచ్చినా ఎలాంటి ఆంక్షలు విధించకుండా అందరినీ అనుమతించాలన్నారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు. రోడ్ షో ను విభాగాల వారీగా విభజించి ప్రజాప్రతినిధులకు, అధికారులకు బాధ్యతలు అప్పగించారు. రోడ్ షో, బహిరంగ సభలకు సంబంధించి పర్యవేక్షణ బాధ్యతలను మూడు పార్టీల నుంచి ఒక్కొక్క ప్రజాప్రతినిధి చొప్పన ముగ్గురికి సమన్వయ బాధ్యతలు అప్పగించారు. క్యార్యక్రమానికి హాజరైన ప్రజలు సురక్షితంగా తమ ఇళ్లకు చేరేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ సభలో నియోజకవర్గాల వారీగా బ్లాక్‌లు ఏర్పాటుచేయాలని, ప్రజాప్రతినిధులు సమన్వయ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.
అంచనా 3 లక్షల మంది
ప్రధానమంత్రి బహిరంగ సభకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా నుంచి సుమారు 3 లక్షల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేసి, ఇందుకు తగ్గట్లుగా వసతులు, భోజన సదుపాయం కల్పించాలని మంత్రుల బృందం ఆదేశించింది. జనసమీకరణ, పార్కింగ్, పాస్‌ల పంపిణీపైనా సమావేశంలో చర్చించారు. ద్విచక్ర వాహనాలపై వచ్చేవారికి కూడా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రధాని బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన మంత్రుల బృందం
ఈ నెల 8వ తేదీన ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభ స్థలాన్ని మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని మంత్రుల బృందం పరిశీలించింది. ప్రాంగణం మొత్త కలియతిరిగి అధికారులకు పలు సూచనలు చేసింది. ఈ కార్యక్రమంలో కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు, పాల్గొన్నారు.
విశాఖ ఎయిర్ పోర్ట్‌లో మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై సమీక్షించేందుకు వచ్చిన రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌కు ఆదివారం ఉదయం విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి మంత్రికి స్వాగతం పలికారు.