- రాజధాని అమరావతితోనే రాష్ట్ర భవిష్యత్తు
- మూడు రాజధానుల పేరుతో మోసం చేసిన జగన్‌్ రెడ్డి
- పునర్నిర్మాణ సభను సక్సెస్ చేసి అమరావతికి మద్దతు తెలుపుదాం
- విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపు
- ప్రధాని పర్యటనపై కూటమి నేతలతో సమీక్ష
అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న… ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనే… అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభను విజయవంతం చేద్దామని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు. ప్రధాని సభను విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లకు సంబంధించి తాడేపల్లి మున్సిపాలిటీ, రూరల్, దుగ్గిరాల ప్రాంత కూటమి నేతలతో మంగళవారం మంత్రి గొట్టిపాటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నేతలకు దిశా నిర్దేశం చేసిన మంత్రి గొట్టిపాటి..సభను విజయవంతం చేయడానికి అందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. రాజధాని అమరావతితోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆధారపడి ఉందని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ఒక్క అవకాశం అంటూ అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణాన్ని అర్ధంతరంగా ఆపేసి, ఐదేళువెనక్కి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానులంటూ ప్రజలందరినీ జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణంతోనే ఆంధ్రప్రదేశ్ యువతకు భవిత, భవిష్యత్తుకు భరోసా అని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పునర్నిర్మాణ బాధ్యత తీసుకున్నారని వెల్లడిరచారు. రాజధానిలో కీలక ప్రాంతాలైన తాడేపల్లి మున్సిపాలిటీ, రూరల్ లతో పాటు దుగ్గిరాల ప్రాంతం నుంచి ప్రతి కుటుంబం.. అమరావతి పునర్నిర్మాణం సందర్భంగా మే 2వ తేదీ జరిగే ప్రధాని నరేంద్ర మోదీ సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ సభను విజయవంతం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకి, రాజధాని అమరావతికి మద్ధతు తెలియజేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. అదే విధంగా భారీ ఎత్తున జరిగే పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనడానికి లక్షలాదిగా తరలి వచ్చే కూటమి కార్యకర్తలతో పాటు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కార్యకర్తలకు మంత్రి గొట్టిపాటి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో పాటు పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.