- కేంద్రం నుండి నిధులు తెచ్చుకుందాం
- 2017 మెట్రో పాలసీ అధారంగా ఫండిరగ్పై కేంద్రంతో చర్చిద్దాం
- రాష్ట్ర విభజన చట్టంలోనూ మెట్రో ప్రాజెక్ట్ ఉంది
- విశాఖ, విజయవాడల్లో డబుల్ డెక్కర్ విధానంలో 25 కి.మీ మేర మెట్రో నిర్మాణం
- నాలుగేళ్లలో అందుబాటులోకి తేవటం లక్ష్యం
- రెండు నగరాల్లో మెట్రో ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
అమరావతి (చైతన్యరథం): విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 66 కి.మీ మేర విజయవాడ మెట్రో, 76.90 కి.మీ మేర విశాఖ మెట్రో ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇప్పటికే డీపీఆర్‌లు ఆమోదించారు. ఈ ప్రాజెక్టులకు నిధుల అంశంపై గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి ప్రజెంటేషన్ ద్వారా మెట్రో ప్రాజెక్టు స్థితిగతులను వివరించారు. 2017లో వచ్చిన కొత్త మెట్రో పాలసీ ప్రకారం మన రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు ఫండిరగ్ మోడల్స్‌పై ముఖ్యమంత్రి చర్చించారు. 2017 వరకు 100 శాతం నిధులు కేంద్రం భరించే విధానం లేదు. అయితే 2017 పాలసీ ప్రకారం 100 శాతం ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తూ కోల్‌కతా నగరంలో 16 కి.మీ మేర ప్రాజెక్టు చేపట్టారు. రూ.8,565 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ, రైల్వే శాఖలు కోల్‌కతా ప్రాజెక్టును చేపట్టాయి. ఇదే తరహాలో ఏపీలో కూడా మెట్రో పాజెక్టులు చేపట్టే అంశంపై కేంద్రంతో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు ఉందని సీఎం తెలిపారు. ఆ చట్ట ప్రకారమయినా…లేకపోతే 2017 మెట్రో పాలసీ ద్వారానైనా కేంద్రం సాయం చేయాలన్నారు. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడిరచారు.
రెండు చోట్లా డబుల్ డెక్కర్
విశాఖ, విజయవాడలలో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయబోతున్నారు. హైవే ఉన్న చోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టును నిర్మిస్తారు. ఈ విధానంలో కింద రోడ్డు దానిపైన ఫ్లైఓవర్ ఆపైన మెట్రో వస్తుంది. విశాఖలో మొదటి స్టేజ్‌లో చేపట్టే మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కి.మీ, గాజువాక నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్ వరకు 4 కి.మీ డబుల్ డెక్కర్ మోడల్లో మెట్రో రైల్ మార్గం నిర్మించనున్నారు. అలాగే విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కి.మీ డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపడతారు. ఇప్పటికే ఈ తరహా మోడళ్లు పలు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మన రాష్ట్రంలోనూ ఈ తరహా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కేంద్రంతో త్వరతగతిన సంప్రదింపులు పూర్తి చేసి మెట్రో పనులు ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. 4 ఏళ్లలో రెండు నగరాల్లోనూ మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు పొంగూరు నారాయణ, బీసీ జనార్థన్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.