- రాష్ట్రాభివృద్ధి లక్ష్య సాధనకు ఏపీతో చేతులు కలపండి
- ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీలపై నైపుణ్యాభివృద్ధిలో భాగస్వామ్యం
- క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్‌కి సహకారం అందించండి
- యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్ సందర్శనలో మంత్రి నారా లోకేష్
ఆస్ట్రేలియా (మెల్‌బోర్న్): రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయం (యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్)ను సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎమ్మా జాన్స్టన్, డిప్యూటీ వైస్ ఛాన్సలర్ (గ్లోబల్, కల్చర్ అండ్ ఎంగేజ్‌మెంట్) ప్రొఫెసర్ మైఖేల్ వెస్లీ, డీన్ ఆఫ్ ఆర్ట్స్ ప్రొఫెసర్ జెన్నీఫర్ బాలింట్, డీన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ మారెక్ టెసార్, డీన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఐటీ ప్రొఫెసర్ అంపలవనపిళ్లై (థాస్) నిర్మలథాస్, డీన్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ మోయిరా ఓ’బ్రియన్ తదితర ఎగ్జిక్యూటివ్‌లు లోకేష్‌కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్వాంటమ్ పరిశోధనలు, ఉపాధ్యాయ శిక్షణపై వర్సిటీ ఉన్నతస్థాయి బృందంతో మంత్రి లోకేష్ చర్చించారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎమ్మా జాన్స్టన్ మాట్లాడుతూ… 1853లో స్థాపితమైన మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయం ఆస్ట్రేలియాలో అగ్రస్థానంలో ఉందన్నారు. క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2025లో అంతర్జాతీయంగా 13వ స్థానాన్ని సంపాదించిందని తెలిపారు. ప్రస్తుతం 55వేల మందికి పైగా విద్యార్థులు తమ యూనివర్సిటీలో చదువుతున్నారన్నారు. పరిశోధన, విద్యా నాణ్యత, సామాజిక భాగస్వామ్యం రంగాల్లో పేరొందిన తమ విశ్వవిద్యాలయం… ఆవిష్కరణలు, ప్రపంచ భాగస్వామ్యాలు, స్థిరత్వం, సామాజిక ప్రభావంవంటి అంశాలపై దృష్టిసారించిందని తెలిపారు. మెల్‌బోర్న్ నగరంలో ఐదు క్యాంపస్‌లతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. అంతర్జాతీయ సహకారంపై కేంద్రీకృతమైన ప్రపంచ వ్యూహంతో తాము ముందుకు సాగుతున్నట్లు వెల్లడిరచారు.
భారత్‌లోని న్యూ ఢల్లీిలో మెల్‌బోర్న్ గ్లోబల్ సెంటర్ భాగస్వామ్యం, పరిశోధన, అనుసంధాన కార్యక్రమాలకు వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తోంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని శూలిని విశ్వవిద్యాలయం, భారత వ్యవసాయ పరిశోధనా మండలితో సహా ఐదుకు పైగా భారతీయ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం కలిగి ఉన్నాం. భారతీయ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ భాగస్వాములను అనుసంధానిస్తూ విద్య, సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహిస్తున్నాం. భారతదేశంలో బోధనా క్యాంపస్ లేకుండా స్థానిక భాగస్వామ్యాల ద్వారా ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్, డ్యూయల్ డిగ్రీలు, సంయుక్త పరిశోధన కార్యక్రమాలను అందిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ ఎమ్మా జాన్స్టన్ తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలతో కలిసి కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అధునాతన సాంకేతికలపై స్థిరమైన పద్ధతుల్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని కోరారు. క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్‌కు సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో రెన్యువబుల్ ఎనర్జీ, వ్యవసాయం, ఆరోగ్యరంగాల్లో సంయుక్త పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేసి రాష్ట్రాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో భాగస్వామ్యం వహించండి. పంట దిగుబడులు, వాటర్ మేనేజ్‌మెంట్, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడంపై ఏపీలోని ఆచార్య ఎన్‌జి రంగా విశ్వవిద్యాలయంతో కలిసి పరస్పర సహకారంతో పరిశోధనలు నిర్వహించండి. స్థానిక సంస్థలను భాగస్వాములుగా చేసి డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్, టెలీ మెడిసిన్ ద్వారా ఆరోగ్య సేవలను మెరుగుపర్చేందుకు సహకారం అందించండి. స్మార్ట్ సిటీ ప్లానింగ్, వ్యర్థ నిర్వహణ, పునరుత్పాదక శక్తిరంగాల్లో నైపుణ్యాలను పంచి ఆంధ్రప్రదేశ్ పటణాభివృద్ధి లక్ష్యాల సాధనకు మద్దతుగా నిలవాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.














