అమరావతి (చైతన్య రథం): రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ రచనా కమిటీ సేవలు స్మరించుకుంటూ.. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దామని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ.. ‘‘మన హక్కులకు పెద్దదిక్కుగా నిలిచిన రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ రచనా కమిటీ సేవలు స్మరించుకుందాం. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దాం. రాజ్యాంగ దినోత్సవాన్ని మా పాఠశాల విద్యాశాఖ వినూత్నంగా జరుపుతోంది. రాజ్యాంగం విలువల గురించి చిన్ననాటి నుంచే అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహిస్తున్నాం. మా విద్యార్థులు ప్రజాప్రతినిధులుగా సభను ఎలా నడిపిస్తారోననే ఆసక్తి నెలకొంది. స్టూడెంట్ అసెంబ్లీ పూర్తయ్యాక విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా బొమ్మలు, సులభమైన భాషలో రూపొందించిన బాలల భారత రాజ్యాంగం ఆవిష్కరణ జరగనుంది’’ అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.











