- అమరావతికి రూ.10 కోట్ల విరాళం
కానూరు: ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన వ్యక్తి రామోజీరావు అని ఆయన తనయుడు, ‘ఈనాడు’ ఎండీ కిరణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో కిరణ్ మాట్లాడుతూ.. ప్రజల హక్కులను పాలకులు కబళించినప్పుడల్లా రామోజీ బాధితుల పక్షం వహించేవారన్నారు. దేశంలో ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారు. ఆయన నమ్మిన పాటించిన విలువలను త్రికరణ శుద్ధిగా కొనసాగిస్తామని మా కుటుంబ సభ్యులు, నా తరపున సభా ముఖంగా మాటిస్తున్నా. నాన్నగారి స్ఫూర్తితో ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటామని హామీ ఇస్తున్నా. రాజధాని అమరావతి కోసం రూ.10 కోట్లు విరాళం ప్రకటిస్తున్నాం. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పేరు రామోజీరావు సూచించారు. దేశంలోనే గొప్ప నగరంగా అమరావతి ఎదగాలని నాన్నగారు ఆకాంక్షించారు. ఈ సభ నాన్నగారి ఆశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభగా భావిస్తున్నాం. సంస్మరణ సభ నిర్వహించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు నాన్నగారు పరితపించేవారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాన్నగారు అండగా నిలిచారు. నాన్నగారి వారసత్వాన్ని కొనసాగిస్తామని కిరణ్ అన్నారు. అమరావతి నిర్మాణానికి విరాళంగా ప్రకటించిన రూ. 10 కోట్ల చెక్కును సభా వేదికపైనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు కిరణ్ అందించారు.
అందనంత ఎత్తుకు: మంత్రి పార్థసారథి
రామోజీరావు అతి సామాన్య కుటుంబంలో పుట్టి అత్యున్నత స్థితికి ఎదిగారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలో ఎవరెస్టు శిఖరంలా అందనంత ఎత్తుకు ఎదిగారన్నారు. పత్రిక ద్వారా సమాజంలో అనేక మార్పులు తెచ్చారు. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఎవరైనా ఉన్నతస్థితికి చేరుకోవచ్చని నిరూపించారు. ప్రజాసమస్యలపై పత్రిక ద్వారా కలం రaళిపించారని మంత్రి పార్థసారథి అన్నారు.
పోరాటయోధుడు రామోజీ: ఎన్.రామ్
రామోజీరావుతో తనకు వ్యక్తిగతంగా మంచి పరిచయం ఉందని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, హిందూ దినపత్రిక మాజీ ఎడిటర్ ఎన్.రామ్ అన్నారు. ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిగా ఆయన ఉన్నప్పుడు ఆ పరిచయం ఏర్పడిరదన్నారు. రామోజీరావు.. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజాన్ని నమ్మేవారు. అప్పట్లో దేశ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉండేవి. రాజీవ్ ప్రభుత్వం తెచ్చిన పరువునష్టం బిల్లులో కఠిన నిబంధనలు పెట్టారు. పాత్రికేయులే లక్ష్యంగా ఆ నిబంధనలు రూపొందించారు. పరువునష్టం బిల్లుపై ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిగా రామోజీ పోరాడారు. ఆయన పోరాటం ఫలితంగా ఆ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకుంది. ఈనాడు పత్రిక సమాజంలోని క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పట్టింది. ఈనాడు ప్రస్థానంపై ఆస్ట్రేలియన్ రాజకీయవేత్త రాబిన్ జెఫ్రీ ఒక పుస్తకం కూడా రాశారని ఎన్ రామ్ చెప్పారు.
సమాజంపై చెరగని ముద్ర: గులాబ్ కొఠారి
రామోజీరావుతో తనకు 40 ఏళ్లుగా పరిచయం ఉందని రాజస్థాన్ పత్రిక ఎడిటర్ గులాబ్ కొఠారి చెప్పారు. ఆయన ప్రజల సమస్యలపై కలం కదిలించారు. సమాజంలో అనేక రంగాల్లో తనదైన ముద్రవేశారు. సంస్కృతి, సంప్రదాయాలకు రామోజీరావు ఎక్కువ విలువ ఇచ్చేవారు. ఎప్పుడూ ప్రజా సమస్యల గురించే ఆలోచించేవారని కొఠారి అన్నారు.
భారతరత్న ఇవ్వాలి: రాజమౌళి
రామోజీరావు తన జీవితంలో ఎన్నో శిఖరాలు అధిరోహించారని దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి అన్నారు. తెలుగు ప్రజలకు ఎంతో చేసిన ఆయనకు మనమేం చేయగలం అంటూ, రామోజీరావుకు భారతరత్న ఇవ్వడం సముచితం, సబబు అని ఉద్ఘాటించారు. రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని రాజమౌళి కోరారు.
రామోజీలా ఒక్కరోజు బతికినా చాలు: కీరవాణి
పాత్రికేయ, సినీ రంగాలలో దిగ్గజ స్థాయికి ఎదిగిన వ్యక్తి రామోజీరావు అని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పేర్కొన్నారు. మహోన్నతమైన వ్యక్తిత్వానికి రామోజీరావు ప్రతీక అని కొనియాడారు. ఆయనలా ఒక్కరోజు జీవించగలిగినా చాలు అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. రామోజీరావు సంగీత దర్శకుడిగా తనకు జన్మనిచ్చారని, ఉషా కిరణ్ మూవీస్ లో పీపుల్స్ ఎన్ కౌంటర్ చిత్రంతో సంగీత దర్శకుడిగా తన ప్రస్థానం మొదలైందని కీరవాణి గుర్తు చేసుకున్నారు. రామోజీరావు వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.
ఎంతోమంది చిన్న నటులకు లైఫ్ ఇచ్చారు: మురళీమోహన్
విజయవాడలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభకు సీనియర్ సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. రైతు కుటుంబం నుంచి వచ్చి అనేక రంగాల్లో రాణించారని పేర్కొన్నారు. రామోజీరావు ఉషాకిరణ్ మూవీస్ సంస్థను స్థాపించి సినీరంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఎంతో మంది చిన్న నటులకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారని మురళీమోహన్ వెల్లడిరచారు. సమాజాన్ని జాగృతం చేసేలా, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా సినిమాలు తీయాలని ఆయన ఎప్పుడూ అంటుండేవారని తెలిపారు.
ఇది నాకు దక్కిన అదృష్టం: జయసుధ
రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొనడం తనకు దక్కిన అదృష్టమని సినీనటి జయసుధ అన్నారు. రామోజీరావు ఒక విజ్ఞాన సర్వస్వమన్నారు. క్రమశిక్షణతో ఆయన ఎదగడమే కాకుండా తన పక్కనున్న వారిని కూడా పైకి తీసుకొచ్చారని కొనియాడారు. చిత్ర పరిశ్రమలో ఎంతోమందికి సెకండ్ ఇన్నింగ్స్ ఆయన వల్లే సాధ్యమైంది.. ఆయన నిర్మించిన సినిమాల్లో నటించడం తాను చేసుకున్న అదృష్టమని జయసుధ అన్నారు.