- అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు విశాఖ వేదిక
- మే 21నుంచి జూన్ 21వరకు యోగా మంత్
- రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం, వార్డులో కార్యక్రమాల నిర్వహణ
- నెలరోజుల పాటు యోగా సాధన చేసిన వారికి సర్టిఫికెట్
- లక్షల మందితో ప్రధాని యోగాసనాలకు విస్తృత ఏర్పాట్లు
- ఆర్‌కె బీచ్‌నుంచి తీరం పొడవునా యోగాసనాలకు అవకాశం
- రాష్ట్రంలో యోగా సాధన ఆరోగ్య వ్యాపకం కావాలి
- యోగాలో కొత్త రికార్డ్ సృష్టిద్దామన్న చంద్రబాబు
- అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై ముఖ్యమంత్రి సమీక్ష
అమరావతి (చైతన్య రథం): విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డేను రికార్డు సృష్టించేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జూన్ 21న జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈసారి విశాఖలో పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధాని స్వయంగా ప్రకటించారు. దీంతో ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. గ్రాండ్ సక్సెస్ చేసే అంశంపై ఫోకస్ పెట్టిన సీఎం… కార్యచరణపై క్యాంప్ ఆఫీస్‌లో శుక్రవారం అధికారులతో సమీక్ష చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘‘‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్’ను ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్‌గా తీసుకున్నారు. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ప్రధాని వస్తున్న కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడంతో పాటు.. రాష్ట్రంలో యోగా అభ్యాసానికి ఇది నాంది పలకాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. కనీసం రెండు కోట్లమందికి ఈ కార్యక్రమం చేరాలి. ‘యోగాంధ్ర-2025’ థీమ్‌తో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలి. దీనికోసం ప్రజలను సన్నద్ధం చేసేందుకు ఈనెల 21నుంచి జూన్ 21వరకు యోగా మంత్ పాటించాలి. ఈ నెల రోజులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో యోగా ప్రాక్టీస్ జరగాలి. దీనికోసం ప్రైవేటు వ్యక్తులు, శిక్షకులు, యోగా అసోసియేషన్లు, నిపుణులను భాగస్వాములను చేయాలి. నెలరోజులపాటు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో ప్రజలకు యోగాపై శిక్షణ ఇవ్వాలి. నెల రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న వారిని గుర్తిస్తూ సర్టిఫికెట్ ఇవ్వాలి. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా యోగా డేలో పాల్గొనే అంశంపై ప్రజల నుంచి రిజిస్ట్రేషన్లలు తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులను కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలి. యోగా అనేది ప్రాథమిక బాధ్యత అనేలా ప్రతిఒక్కరూ భావించాలి. యోగా డే అనంతరం కూడా రాష్ట్రంలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలి. రాష్ట్రంలో ప్రతిచోటా యోగాపై నెలరోజుల పాటు విస్తృత చర్చ జరగాలి. మనం నిర్వహించే యోగా డే విస్తృత ప్రాచుర్యం కల్పించడానికి ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్‌వంటి సంస్థల సహకారాన్ని తీసుకోవాలి. ఏపీలో జరిగే యోగా డే గత 10 ఏళ్ల కార్యక్రమాలను తిరగరాసేలా ఉండాలి’’ అని సీఎం చంద్రబాబు సూచించారు.
లక్షల మందితో కార్యక్రమం
ఆర్‌కె బీచ్‌లో ప్రధాని కార్యక్రమం, ప్రజల పాల్గొనే ప్రాంతాలు, నిర్వహణపై అధికారులు ప్రజెటేషన్ ఇచ్చారు. ఆర్కె బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అన్నిచోట్లా ప్రజలు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ రోడ్ వరకు సుమారు 2.5 లక్షల మంది యోగాలో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. యోగా నిర్వహించేందుకు 68 ప్రాంతాలు గుర్తించారు. ఆర్కే బీచ్, రుషికొండ, స్కూల్, క్రికెట్, పోలీస్, స్పోర్ట్చ్, నావీ ప్రాంగణాలతోపాటు పలు ఖాళీ ప్రదేశాలను యోగా నిర్వహణకు గుర్తించారు. ఈ 68 లోకేషన్ల ద్వారా 2,58,948 మంది యోగా సాధనకు అవకాశం కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. యోగా దినోత్సవాన్ని ప్రకటించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ప్రధాని పాల్గొనే విశాఖ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని సీఎం సూచించారు. ఇందులో భాగంగా 5 లక్షల మంది భాగస్వాములయ్యేలా ఆర్కె బీచ్ నుంచి శ్రీకాకుళం వరకు బీచ్ పొడవునా అన్ని అనుకూల ప్రాంతాల్లో ప్రజలను ఆహ్వానించి యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
యోగాలో కొత్త రికార్డ్ సృష్టిద్దాం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో జూన్ 21ని అంతర్జాతీయ యోగా డేగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. యోగా డే రోజులో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగా సాధన ఉంటుంది. 2015లో తొలిసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు 36 వేలమందితో ఒకే వేదికపై నిర్వహించిన కార్యక్రమం గిన్నిస్ రికార్డుకు ఎక్కింది. తొలి ఏడాది 84 దేశాల్లో యోగాను నిర్వహించారు. ప్రపంచంలోని 170కి పైగా దేశాలు యోగా డేను ప్రస్తుతం నిర్వహిస్తున్నాయి. 2023లో సూరత్‌లో 1,53,000 మందితో ఒకేచోట అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరిపి మరోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లకు ఎక్కింది. సూరత్ తరహా మోడల్‌లో విశాఖలోనూ యోగా దినోత్సవాన్ని నిర్వహించి… ఈసారి ఆ రికార్డును తిరగరాయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ, ఆయుష్, కేంద్ర ప్రభుత్వ శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.