- గత ప్రభుత్వంలో అధికారుల నిర్వాకం
- భూమిని ఉన్నదాని కన్నా తగ్గించి చూపించారు
- ప్రజావినతుల కార్యక్రమంలో బాధితుడి గోడు
- అర్జీలు స్వీకరించిన మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి
మంగళగిరి(చైతన్యరథం): గత ప్రభుత్వంలో జరిగిన రీ సర్వే తప్పుల తడకగా జరిగిందని చిత్తూరు జిల్లా కమ్మపల్లి గ్రామానికి చెందిన పి.మదుసూధన్ తెలిపారు. .. తమ భూమి ఉండాల్సిన దాని కన్నా తక్కువగా నమోదైందని తప్పును సరిచేసి తమ భూమి తమకు ఉండేలా చూడాలని కోరారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజా వినతుల కార్యక్రమంలో వినతిపత్రం ఇచ్చారు. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి, బుడా చైర్మన్ సలగల రాజశేఖర్‌బాబు అర్జీలు స్వీకరించారు. వచ్చిన అర్జీలపై అధికారులకు ఫోన్లు చేసి పరిష్క రించాలని సూచించారు.
` తమ భూమికి అక్రమ డాక్యుమెంట్లు సృష్టించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన కె.అబ్దుల్ మునాఫ్ వినతిపత్రం ఇచ్చారు.
` 2001లో డీఎస్సీ ద్వారా ఎంపికై ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్‌ఎంలుగా పనిచేస్తున్న తమను డీఎంహెచ్‌వో నుంచి ఏపీవీపీకి తమను బదిలీ చేయడంతో తమ కంటే వెనుక వచ్చిన జూనియర్లను డీఎంహెచ్‌వోలో రెగ్యులర్ చేశారు. తమను మాత్రం కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగిస్తున్నారని, తమ సమస్యను పరిష్కరించాలని అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
` నంద్యాల మున్సిపాలిటీలో గతంలో తాను చేసిన పనులకు ఇంకా డబ్బులు రాక తాను ఇబ్బంది పడుతున్నానని నంద్యాల జిల్లా నంద్యాల మండలం అయ్యలూరు మెట్టకు చెందిన బి.వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. దయచేసి తనకు రావాల్సిన బిల్లులు ఇప్పించా లని విజ్ఞప్తి చేశాడు.
` తమ ఊరి నుంచి బండి ఆత్మకూరుకు రహదారి లేదని.. రహదారి నిర్మించి ప్రజల సమస్యను పరిష్కరించాలని నంద్యాల జిల్లా గడివేముల మండలం తిరుపాడు గ్రామానికి చెందిన చింతకాయల గిరిబాబు వినతిపత్రం ఇచ్చారు.
` తమ పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని తమ పేరుపై ఆన్‌లైన్ చేయమని ఎన్ని సార్లు అధికారులకు అర్జీలు పెట్టుకున్న పట్టించుకోవడం లేదని ప్రకాశం జిల్లా ముండ్ల మూరుకు చెందిన బోడపాటి చంద్రమౌళి ఆవేదన వ్యక్తం చేశాడు. దయచేసి తమ స్వాధీనంలో ఉన్న భూమిని ఆన్‌లైన్ చేయాలని విన్నవించారు.
` గుంటూరు జిల్లా దొర్లవారిపాలెం గ్రామస్తుల నుంచి దాదాపు 154 మంది ఉడా పర్మిషన్ ఉన్న ప్లాట్లను గతంలో కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని.. ఇది జరిగి 30 ఏళ్ల తరువాత ఆ స్థలాలను నిషేధిత జాబితాలో చేర్చారని గ్రామస్తులు తెలిపారు. తాము ప్లాట్లు కొనుగోలు చేసినప్పుడు నిషేధిత జాబితాలో లేని స్థలం నేడు నిషేధిత జాబితాలో చేర్చడంతో ఇబ్బంది పడుతున్నామని.. నిషేధిత జాబితా నుంచి తమ ప్లాట్లను తొలగిం చాలని విజ్ఞప్తి చేశారు.
` తమ భూమిని ఎటువంటి సంబంధం లేని వ్యక్తుల పేర్లపైకి అక్రమంగా ఎక్కిం చారని పశ్చిమగోదావరి ఆచంటకు చెందిన తమ్మినీడి విజమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులకు ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని న్యాయం చేయాలని వేడుకుంది.
` తమకు ఎన్‌ఆర్‌జీఈఎఫ్, డీబీఎఫ్‌కు సంబంధించి చేసిన పనుల డబ్బులు రూ.36 లక్షలు రావాలని..త్వరగా వచ్చేలా చూడాలని నంద్యాల జిల్లా ప్యాపిలి మండ లానికి చెందిన గండికోట రామసుబ్బయ్య అభ్యర్థించారు.
` తాము కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న భూమిని తమకు తెలియకుండా ఆన్‌లైన్ చేసుకుని ఆక్రమణదారులు ప్రభుత్వ లబ్ధి పొందుతున్నారని..దీనిపై విచారించి తమకు న్యాయం చేయాలని కడప జిల్లా వీరనాయినిపల్లె మండలానికి చెందిన నడిపి సుబ్బిరెడ్డి అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశాడు.