- హిందాల్కో అత్యాధునిక ప్లాంట్
- ఐ ఫోన్ విడిభాగాల తయారీ
- రూ. 586 కోట్ల పెట్టుబడి
- సీఎం చంద్రబాబు కృషికి ఫలితం
అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రప్రగతి విషయంలో ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. అలాగే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో అనితర సాధ్యమనే రీతిలో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పానికి భారీ పెట్టుబడితో హిందాల్కో సంస్థ రానున్నది. దీంతో కుప్పం ప్రాంతం ఒక కొత్త పారిశ్రామిక విప్లవానికి వేదిక కాబోతోంది. ప్రపంచంలోని అతిపెద్ద అల్యూమినియం తయారీ సంస్థల్లో ఒకటైన హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, కుప్పంలో రూ. 586 కోట్లతో ఒక అత్యాధునిక అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది.
ఈ ప్లాంట్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం అల్యూమినియం ఉత్పత్తులను మాత్రమే కాదు, యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్‌ల ఛాసిస్ (బాడీ) లను ప్రత్యేకంగా తయారు చేస్తుంది. ఐ ఫోన్లు ఇండియా నుంచి భారీగా ఎగుమతి అవుతున్నాయి. బెంగళూరు సమీపంలో ప్లాంట్ కూడా ప్రారంభమయింది. కుప్పం కూడా బెంగళూరుకు సమీపంలోనే ఉంటుంది. అందుకే అక్కడ ప్లాంట్ పెట్టాలని హిందాల్కో నిర్ణయించుకుంది.
ఆదిత్య బిర్లా గ్రూప్‌లో ఒక ప్రముఖ సంస్థ అయిన హిందాల్కో.. అల్యూమినియం, రాగి ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. కేవలం భారతదేశానికే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో దీని వ్యాపార కార్యకలాపాలు విస్తరించి ఉన్నాయి. ఆటోమొబైల్స్, విమానాలు, ప్యాకేజింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రంగాలకు ఈ సంస్థ కీలకమైన ఉత్పత్తులను అందిస్తుంది. లక్షల కోట్ల టర్నోవర్ కలిగిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వేలమందికి ఉపాధి కల్పిస్తోంది. కుప్పం ప్లాంట్ పై రూ. 586 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్లాంట్ యాపిల్ గ్లోబల్ సప్లై చైన్‌లో ఒక కీలకమైన భాగం కాబోతోందని పారిశ్రామిక కవర్గాలు చెబుతున్నాయి. ఈ ప్లాంట్ నిర్మాణం ద్వారా సుమారు వెయ్యి ఉద్యోగాలు లభించనున్నాయి. దీనిని కీలకమైన విడిభాగాలను ఉత్పత్తి చేసే దిశగా ఒక ముందడుగుగా చెబుతున్నారు. గతంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఐఫోన్ విడిభాగాలను ఇప్పుడు భారతదేశంలోనే తయారు చేయడం అనేది దేశ పారిశ్రామిక అభివృద్ధికి, సాంకేతిక పురోగతికి ఒక గొప్ప సంకేతమని సంతృప్తి వ్యక్తమవుతోంది. హిందాల్కో లాంటి ప్రపంచ స్థాయి సంస్థ పెట్టుబడి పెట్టడం వల్ల, ఈ ప్రాంతం మరిన్ని పెట్టుబడులకు కేంద్రంగా మారే అవకాశం ఉంది.
కుప్పంలో హిందాల్కో ప్రాజెక్టు నీకు రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) అతి త్వరలో ఆమోదిస్తుందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి అవుతుందనడంలో సందేహం లేదంటున్నారు అధికారులు. ఈ భారీ ప్రాజెక్టుకు ఆ సంస్థ కుప్పంనే ఎన్నుకోవడానికి అది ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడమే కాకుండా.. భౌగోళికంగా బెంగళూరు మరియు చెన్నై వంటి ప్రముఖ పారిశ్రామిక నగరాలకు దగ్గరగా ఉండటంతో పెట్టుబడులకు ఆకర్షణీయమైన కేంద్రంగా మారుతోంది. బెంగళూరు నుంచి కేవలం 120 కిలోమీటర్ల దూరంలో ఉండడం కుప్పంకు ప్లస్ పాయింట్. ఇక చెన్నై నుంచి కుప్పం మధ్య దూరం 200 కిలోమీటర్లు మాత్రమే. ఈ రెండు నగరాల మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే వెసులుబాటు ఇక్కడ పెట్టుబడులు పెట్టే వారికి ఉంటుంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు – ఎస్‌ఐపీబీ ఆమోదం తెలపనుంది. ఈ పెట్టుబడి ఏపీ చరిత్రలో కీలకం కానుంది. అన్ని సవ్యంగా జరిగితే హిందాల్కో ప్రాజెక్టు 2027 నాటికి పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. దాదాపు ప్రత్యక్షంగా 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెబుతున్నారు. ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 2025-30 కింద ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. దీంతో ఈ సంస్థకు సబ్సిడీ కింద ల్యాండ్, ఇతర ప్రోత్సాహాకాలు అందిచనున్నారు.