- నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైసీపీ నేతలపై ఫిర్యాదు
- దోపిడీ దారులపై చర్యలు తీసుకోవాలని బాధితుల వినతి
- భూమి కబ్జా చేసిన బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్
- టీడీపీ కేంద్ర కార్యాలయానికి అర్జీలతో తరలి వచ్చిన జనం
- వినతులు స్వీకరించిన నేతలు వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి
అమరావతి (చైతన్యరథం): వైసీపీ నేతల దోపిడీలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పనపల్లి దేవస్థానంలోని కేశఖండన శాలలో పనిచేసే నాయీ బ్రాహ్మణులు గోడు వెళ్లబోసుకున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన 110 జీవోను అడ్డుపెట్టుకొని వైసీపీ హయాంలో నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరించిన సిద్ధవటం యానాదయ్య, ఆంధ్రప్రదేశ్ దేవాలయాలకు జేఏసీ నాయకులమని చెప్పుకుంటున్న గుంటుపల్లి రామదాసు, ర్యాలి వెంకటరమణ, గౌరీ లక్ష్మీ నారాయణలు తమకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద లక్ష చొప్పున వసూలు చేశారని ఫిర్యాదు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.10 కోట్లు దండుకున్నారని.. ఈ దోపిడీపై విచారణ జరిపి వారిని కఠినంగా శిక్షించాలని నేతలకు బాధితులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య.. సమస్యపై కోనసీమ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. సమస్యను తెలియజేసి విచారించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ూజుజుణAూ చైర్మన్ దీపక్ రెడ్డి పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
వైసీపీకి చెందిన బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ తమ భూమిని ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడని..కడప జిల్లా బద్వేల్ మండలానికి చెందిన ఎన్ సుధాకర్ ఫిర్యాదు చేశాడు. దానిపై తాము కోర్టుకు వెళితే స్టే ఆర్డర్ ఇచ్చిందని, అయినా అక్రమ నిర్మాణాలు ఆగలేదని వాపోయారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు.
తాము టీడీపీకి అనుకూలంగా ఉండటంతో తన తండ్రిపై వైసీపీ నేతలు హత్యయత్నం చేయగా.. కేసు కోర్టుకు వెళితే అక్కడ పీపీ వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని పల్నాడు జిల్లా మాచర్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన దండు నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడున్న పీపీ వల్ల తమకు న్యాయం జరగదని, కొత్త పీపీని ఏర్పాటు చేసి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
తమ పొలంలోకి వెళ్లనివ్వకుండా సీఐ చిన్న గొల్లకోటయ్య, కానిస్టేబుల్ గొల్ల మునీంద్రలు తమను అడ్డుకుంటున్నారని కర్నూలు జిల్లా దేవనకొండ మండలం వరిముక్కల గ్రామానికి చెందిన వడ్డె హరికృష్ణ వాపోయాడు. తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించాడు. వైసీపీ కండువా వేసుకుంటేనే తమ పొలానికి దారి ఇస్తామని లేదంటే.. దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.
తమ తాతల నుండి తమకు వారసత్వంగా వచ్చిన భూమిని ఆన్ లైన్ చేయమని అడుగుతుంటే అధికారులు పట్టించుకోకుండా తిప్పుకుంటున్నారని కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన కటక బీబీ వాపోయారు. దాదాపు 15 సంవత్సరాల నుండి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని తమకు వారసత్వంగా వచ్చిన భూమిని ఆన్ లైన్ చేసి తమ సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు.
తనకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని కోటా లక్ష్మి అనే మహిళ కబ్జా చేసి మరొకరికి అమ్మేసుకుందని కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మట్టా ఏసు కుమారి ఫిర్యాదు చేసింది. ఆమెపై చర్యలు తీసుకొని తమ ఇంటిని తనకు ఇప్పించాలని టీడీపీ నేతలను ఏసు కుమారి వేడుకుంది.
ఆలయ కార్యదర్శి బత్తుల గురుమూర్తి దాదాపు రూ.10 లక్షలు గుడి సొమ్ము కాజేశాడని విజయవాడ పరిధిలోని గంగానమ్మ రామాలయ దేవస్థాన కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు. అతని అవినీతి దందాపై విచారణ జరిపించి సొమ్ములు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం తమ విన్నపాన్ని మన్నించి బేడ, బుడగ జంగం కులాన్ని షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చి రాజ్యంగ బద్ధమైన హక్కులు, రిజర్వేషన్ కల్పించాలని బేడ, బుడగ సంక్షేమ సంఘం సభ్యులు సమర్పించిన వినతి పత్రంలో కోరారు.
తమ ఇంటివద్ద ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించమంటే ఏకంగా లక్షా యాబై వేల రూపాయాలు డిమాండ్ చేస్తున్నారని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేవాడ గ్రామానికి చెందిన కొల్లా అప్పల సీతారామయ్య వాపోయాడు. తమ ఆర్థిక పరిస్థితి బాగా లేదని, తాము డబ్బులు చెల్లించలేమని నిస్సహాయత వ్యక్తం చేశాడు. దయచేసి తమ ఇంటి వద్ద ప్రమాదకరంగా ఉన్న టాన్స్‌ఫార్మర్‌ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు.
తమ పేరు మీద ఉన్న భూములను కత్తులు పెట్టి బెదిరించి ఈశ్వరయ్య, నాగేశ్వర్, నాగేశంలు కబ్జా చేశారని సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన కాశెట్టి ఓబులమ్మ ఆరోపించింది. దీనీపై విచారించి తమ భూములను తమకు వచ్చేలా చూడాలని కోరింది.