- మంత్రి కొల్లు రవీంద్ర ఉద్ఘాటన
- నవోదయం 2.0 వాల్‌పోస్టర్లు ఆవిష్కరణ
- జెండా ఊపి ప్రచార రథం ప్రారంభించిన మంత్రి
మచిలీపట్నం (చైతన్యరథం): వచ్చే మే 1వ తేదీ నాటికి కృష్ణాజిల్లాను నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని గనులు, భూగర్భ వనరులు, ఎక్సయిజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన నవోదయం కార్యక్రమంలో మంత్రి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సారా రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా 2016లో తొలిసారి నవోదయం కార్యక్రమం ప్రారంభించామన్నారు. అప్పటి 13జిల్లాల రాష్ట్రంలో 11 జిల్లాలను సారా రహితంగా చేశాం. అయితే గత పాలకులు ఐదేళ్లు సారా ఏరులై పారేలా చేశారు. రాష్ట్రంలో నాణ్యమైన మద్యం అందుబాటులో లేకపోవడం, పొరుగు రాష్ట్రాల నుండి ఎక్కువగా మద్యం అక్రమంగా దిగుమతి కావడం వలన భారీగా ఆదాయం కూడా కోల్పోయాం. మరో వైపు సెబ్ పేరుతో ఎక్సైజ్ వ్యవస్థను ప్రభుత్వం నాశనం చేసింది. ఫలితంగా నిఘా కొరవడిరది. రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం ఢల్లీి లిక్కర్ స్కాం కన్నా పెద్దదని మొన్నటి వరకు వైసీపీలో ఉన్న వారే బయట పెట్టారు. కిళ్ళీ షాపుల్లో కూడా డిజిటల్ చెల్లింపులు ఉన్న సమయంలో మన రాష్ట్రంలో కేవలం నగదు అమ్మకాలు మాత్రమే జరిపి భారీ దోపిడీకి పాల్పడ్డారు. నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు సారాకు అలవాటు పడ్డారు.
కల్తీ సారా కారణంగా జంగారెడ్డి గూడెంలో 42మంది ప్రాణాలు వదిలారు. నాటు సారా తయారీలో యూరియా, బ్యాటరీ పౌడర్ లాంటివి కలుపుతున్నారు. ఇవి తాగితే ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ఈ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం ద్వారా మాత్రమే ప్రజల ప్రాణాలు కాపాడగలం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్సైజ్ వ్యవస్థను ప్రక్షాళన చేసింది. నెల రోజుల్లో నాటు సారా రహిత జిల్లాగా కృష్ణా జిల్లాను మార్చి చూపిద్దాం. సారా అమ్మకాలపై దాడులు చేయడంతో పాటుగా, వ్యాపారులకు పునరావాసం కల్పిద్దాం. పేదలకు అవసరమైన స్వయం ఉపాధి కల్పించి నాటు సారా లేకుండా చేద్దాం. డీ అడిక్షన్ కేంద్రాల ఏర్పాటు ద్వారా బాధితులకు భరోసా కల్పిద్దామని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. అనంతరం నవోదయం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు, వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, అధికారులతో కలిసి మంత్రి రవీంద్ర ఆవిష్కరించారు. నవోదయం 2.0 కార్యక్రమం ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
`