- టెక్నోడోమ్ ఎల్‌ఈడీ టీవీ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్, టెక్సానా రేడీమేడ్ దుస్తుల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్
- కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్‌లో ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనం ప్రారంభం
కొప్పర్తి (చైతన్యరథం): కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్, ఐటీ ఉత్పత్తుల తయారీ సంస్థ టెక్నోడోమ్.. కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన ఎల్‌ఈడీ టీవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా టెక్నోడోమ్ ఎల్‌ఈడీ టీవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌కు చేరుకున్న మంత్రి లోకేష్‌కు సంస్థ ప్రతినిధులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. రిబ్బన్ కట్ చేసిన మంత్రి.. ఎల్‌ఈడీ టీవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను లాంఛనంగా ప్రారంభించి, శిలఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్లాంట్‌లోని లిక్విడ్ క్రిస్టల్ మాడ్యూల్(ఎల్‌సీఎమ్) తయారీ విభాగాన్ని, ఫైనల్ అసెంబ్లింగ్ యూనిట్, క్వాలిటీ డిపార్ట్‌మెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి నారా లోకేష్‌ను టెక్నోడోమ్ సీఎండీ సాకేత్ గౌరవ్, హెచ్‌ఆర్ మేనేజర్ శివశంకర్ శాలువాతో సత్కరించారు.
టెక్నోడోమ్.. రూ.121 కోట్ల పెట్టుబడి, 300 ఉద్యోగాలు
ఎలక్ట్రానిక్స్, ఇతర గృహోపకరణాలను తయారుచేసే టెక్నోడోమ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ను 2010లో స్థాపించారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూఢల్లీిలో ఉంది. దుబాయ్ కు చెందిన టెక్నోడోమ్ గ్రూప్‌లో భాగంగా ఈ సంస్థను ఏర్పాటుచేశారు. తమ విస్తరణ ప్రాజెక్టులో భాగంగా కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్టరింగ్ క్లస్టర్‌లో టెక్నోడోమ్ సంస్థ రూ.121 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు 300 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. టెక్నోడోమ్ సంస్థ తమ విస్తృత ప్రణాళికలో భాగంగా ఏటా 10 లక్షల టీవీలు, 10 లక్షల ఎల్‌ఈడి మానిటర్లు తయారు చేయడమే కాకుండా.. భవిష్యత్తులో ఫ్రిజ్‌లు, ఏసీలు, ఇతర గృహోపకరణాలను ఉత్పత్తి చేసేందుకు రూ.55 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
టెక్సానా.. రూ.50 కోట్ల పెట్టుబడి, 2,100 ఉద్యోగాలు
కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ నార్త్ బ్లాక్ లో ప్రముఖ రెడీమేడ్ దుస్తుల తయారీ కంపెనీ టెక్సానా మాన్యుఫాక్చరింగ్ నూతన యూనిట్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. యూనిట్ మొత్తం కలియతిరిగి మహిళా సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేశంలో ప్రముఖ దుస్తుల తయారీ కంపెనీ అయిన టెక్స్‌పోర్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. 19 సొంత యూనిట్లను కలిగిన టెక్స్‌పోర్ట్ సంస్థ.. ఏటా 1.7 కోట్లకు పైగా దుస్తులను ఉత్పత్తి చేస్తోంది. కొప్పర్తిలో తమ అనుబంధ సంస్థ టెక్సానా వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు ప్రత్యక్షంగా 2,100 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.
ఎగ్జిక్యూటివ్ సెంటర్ బిల్డింగ్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్
కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రూ.31.50 కోట్ల వ్యయంతో 6.30 ఎకరాల్లో 46,700 చదరపు గజాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. జీ ప్లస్ 2 విధానంలో భవనాన్ని నిర్మించారు. ఈ సెంటర్ లో కో-వర్కింగ్ స్పేస్, ఏపీఐఐసీ కార్యాలయం, బిజినెస్ సెంటర్‌తో పాటు కన్వెన్షన్ సెంటర్, టెన్నీస్, బ్యాడ్మింటన్ కోర్ట్, పార్కింగ్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఎస్.సవిత, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, సీనియర్ నేత పుత్తా నరసింహారెడ్డి, కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.